Anakapally: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలతో పాటు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన అనకాపల్లి లో జరిగింది. ఆర్థిక సమస్యలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు రామకృష్ణ, దేవి దంపతులు ఏడాది కిందట అనకాపల్లిలోని వుడ్ పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల వైష్ణవి, 13 సంవత్సరాల జాహ్నవి, 9 ఏళ్ల ప్రియ అనే కుమార్తెలు ఉన్నారు. స్థానిక లక్ష్మీ ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఇందులో రామకృష్ణ,దేవి దంపతులతో పాటు కుమార్తెలు వైష్ణవి, జాహ్నవి అనుమానాస్పదంగా మృతి చెందారు.
అర్ధరాత్రి సమయంలో చిన్న కుమార్తె ప్రియ లేచింది. తల్లిదండ్రులతో పాటు అక్కలకు లేపింది. కానీ వారు ఎటువంటి చలనం లేకుండా పడి ఉండడంతో భయంతో బయటకు వచ్చింది. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. దీంతో అపార్ట్ మెంట్ నివాసితులు పోలీసులతో పాటు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నలుగురు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో షాక్ కు గురైన చిన్న కుమార్తె ప్రియను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక సమాచారాన్ని ఆమె నుంచి న్యాయమూర్తి సేకరించారు.
అయితే ఏడాది కిందటే వారు అపార్ట్మెంట్ లో చేరినట్లు సమీప నివాసితులు చెబుతున్నారు. ఇంట్లో బిర్యానీ ప్యాకెట్ తో పాటు కెమికల్ పౌడర్ ఆనవాళ్లు గుర్తించారు. ఆ పౌడర్ ను బంగారం మెరుగు కోసం వాడే సైనేడ్ గా అనుమానిస్తున్నారు. ఆహారంలో ఆ పౌడర్ కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తెనాలిలోని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆర్థిక సమస్యలతో ఏడాదికాలంగా వారు కనిపించకుండా పోయారని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్థిక సమస్యలతోనే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే కుటుంబంలో అందరూ చనిపోగా.. తొమ్మిదేళ్ల ప్రియ ఒంటరిగా మిగిలిపోవడం స్థానికులను కలచివేస్తోంది.