Traffic Challan: ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు కామన్ అయిపోయాయి. పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే పెళ్ళిళ్లు చేసుకుని విడిపోతున్నారు.కానీ పాట్నలో విడిపోయిన ప్రేమ జంట తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పాట్నా, ముజఫర్‌పూర్‌లతో ఒక విఫలమైన ప్రేమకథ గురించి ఈ కథనంలో చెప్పుకుందాం. ఈ ఘటనలో భార్యాభర్తలు ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయారు. భార్య తన భర్త పై ఉన్న కోపం కారణంగా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇద్దరు కలిసి బతకలేమని నిర్ణయించుకుని విడాకులకు అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. భార్యపై కోపాన్ని విచిత్రంగా తీర్చుకున్నాడు. భార్యపై కోపంతో భర్త పాట్నాలో బైక్ పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన భార్యను వేధించడం మొదలు పెట్టాడు. కారణం ఆ బైక్ ఆమె పేరు మీద ఉంది. అందుకే ఆన్‌లైన్ చలాన్ పడినప్పుడల్లా ఆ మెసేజ్ ఆమెకు వెళ్తుండేది. ఆ అమ్మాయి చలాన్ ఫస్ట్ పడినప్పుడు ఏదో పొరపాటున పడిందని కట్టేసింది. కానీ తరచూ చలాన్ లకు సంబంధించిన మెసేజులు వస్తుండడంతో ఆమె పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. ఖాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే యువతికి గతేడాది పాట్నాకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. వివాహం సమయంలో యువతి తండ్రి అల్లుడికి బైక్ బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ బైక్ కుమార్తె పేరు మీద రిజిస్టర్ చేశాడు. వివాహం జరిగిన దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ అమ్మాయి తన భర్తపై కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్తపై కోపంతో విషయం విడాకుల వరకు చేరింది. కానీ భర్త తన భార్య మీద కోపంతో బైకును ఇష్టానుసారం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు. దీని కారణంగా మామ కొనిచ్చిన బైక్ పై తరచూ చలాన్లు పడుతున్నాయి. గత మూడు నెలల్లో నాలుగు సార్లు ట్రాఫిక్ చలాన్ జారీ అయినట్లు యువతి తండ్రి తెలిపాడు. ఈ సమాచారం తన కుమార్తె మొబైల్‌కు వస్తోందన్నారు. మొదట్లో చలాన్ చెల్లించారు. కానీ ఇప్పుడు చలాన్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా యువతి ఆందోళన చెందింది.
తన భార్య తనను కాదని వెళ్లిపోవడంతో కలత చెందిన భర్త భార్య పేరు మీద కొన్న బైక్‌పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు. ఆ అమ్మాయి తన భర్తను సంప్రదించి బైక్ తిరిగి ఇవ్వమని కోరగా తను నిరాకరించాడు. విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నంత వరకు బైక్‌ను తిరిగి ఇవ్వనని భర్త స్పష్టం చేశాడు. విడాకులు తీసుకున్న తర్వాతే బైక్ ఇస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. తన భర్త చర్యలతో విసిగిపోయిన ఆ అమ్మాయి ఈ విషయం గురించి పాట్నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని వారు సూచించారు. ఆమె తన తండ్రితో కలిసి ఖాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న పోలీసు అధికారి ఆ బైక్ ఇప్పటికీ నీ భర్త వద్దే ఉందని ఎలా నిరూపిస్తావని ఆ బాలికను ప్రశ్నించారు. దానిని నిరూపించడానికి అఫిడవిట్ తీసుకోవాలని పోలీసులు యువతికి సూచించారు.