Maharashtra Tomato Farmer: మీరు రైతా.. మంచి ఆదాయం రావాలనుకుంటున్నారా.. నెల రోజుల్లో లక్షాధికారి కావాలనుకుంటున్నారా.. అయితే మీరు చేయాల్సిందల్లా టమాటా సాగు చేయడమే. మండుతున్న టమాటా సామాన్యుడికి అందనంటోంది. పెట్రోల్ ధరలతో పోటీపడి పెరుగుతోంది. దీంతో ఇపుడు ఏ నలుగురు కలిసినా దీనిగురించే టాపిక్.. టమాటా ధరల మంటపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ డిమాండ్ –సప్లయ్ సంక్షోభంలో సాధారణంగా రైతులకు జరిగే మేలు జరిగే సందర్బాలు చాలా తక్కువ. కానీ మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన రైతు తుకారాం భాగోజీ గయాకర్‌ను అదృష్టం వరించింది. 30 రోజుల్లో కోటిన్నర రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టింది టమాటా.
12 ఎకరాల్లో సాగు..
దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర మండిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన రైతు భాగోజీ తనకున్న 12 ఎకరాల్లో టమాటా సాగుచేస్తున్నాడు. ఇంతలా ధర వస్తుందని ఊహించి సాగు చేయలేదు. ఏటా చేస్తున్నట్లుగానే సాగు చేశాడు. అయితే టమాటా ధర అమాంతం పెరిగి రైతుకు అదృష్టం పట్టింది. ఇంతలా కలిసి వస్తుందని బహుశా తుకారాం కూడా ఊహించి ఉండడు.
మంచి దిగుబడి..
తుకారాం భాగోజీ గయాకర్ సాగుచేసిన టమాటా పంట మంచి దిగుబడి ఇచ్చింది. నారాయణగంజ్‌లో తన పంటను విక్రయించడం ద్వారా రైతు రోజుకి రూ.2,100 సంపాదించాడు. దీనికితోడు శుక్రవారం ఒక్కరోజే 900 డబ్బాలను విక్రయించి రూ.18 లక్షలు సంపాదించాడు. తుకారాం తన కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహాయంతో నెలలో 13,000 టమోటా డబ్బాలను విక్రయించాడు. మొత్తంగా నెల రోజుల్లో అతని సంపాదన రూ.1.5 కోట్లకు చేరింది.
మూడు నెలల కష్టానికి ఊహించని ఫలితం..
తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, కుమారుడు ఈశ్వర్ సేల్స్, మేనేజ్‌మెంట్ , ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను నిర్వహిస్తున్నాడు. మూడు నెలలుగా వీరు పడిన కష్టానికి వందల రెట్ల ఫలితం దక్కింది. ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా చాలామంది రైతులు కోటీశ్వరులైనట్టు తెలుస్తోంది. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టమాటా విక్రయించారట.