Tollywood Roundup: కాలగతిలో 2022 కలిసిపోతుండగా 2023 సరికొత్తగా ఆరంభం కానుంది. గడిచిన ఏడాది కాలంలో చర్చించు కోవాల్సిన సినిమా సిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటిలాగే విజయాలు, పరాజయాలు, వివాదాలు, సంచలనాల సమాహారంగా సినిమా క్యాలెండర్ ముగిసింది. కొందరికి మోదం కొందరికి ఖేదం మిగిల్చింది… వినోదాల పరమపదసోపానపటంలో నిచ్చెనలు ఎక్కినవాళ్లున్నారు. పాము కాటుకు బలై పాతాళాన పడినవారున్నారు. ప్రపంచ సినిమా వేదికపై తలెత్తుకునేలా కొన్ని సినిమాలు, నొచ్చుకునేలా మరికొన్ని సినిమాలు రూపొందాయి. 2022 తెలుగు సినిమా ముఖచిత్రం పరిశీలిస్తే…

సంక్రాంతి సప్పగా…
2022 సినిమా కేలండర్ వర్మ మూవీతో ప్రారంభమైంది. జనవరి 1న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్కౌంటర్’ విడుదల చేశారు. వర్మ సినిమా ప్లాప్ అయినా మంచి బోణి అని చెప్పాలి. గత రెండేళ్లు చిత్ర పరిశ్రమ చూసిన కఠిన పరిస్థితులతో పోల్చితే మంచి విజయాలు దక్కాయి. దర్శక నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు కరోనా సంక్షోభం నుండి బయటపడ్డారు. ప్రేక్షకులు స్వేఛ్ఛగా థియేటర్స్ లో సినిమాలు చూశారు. అయితే సినిమా ప్రియులు ఆశగా ఎదురుచూసే సంక్రాంతి సప్పగా సాగింది. బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి చిత్రాలు విడుదలయ్యాయి. ఎలాంటి పోటీలేని బంగార్రాజు మూవీ పెద్దగా కంటెంట్ లేకపోయినా విజయం సాధించింది. థియేటర్స్ లో కరోనా ఆంక్షలు అమలులో ఉండగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.
అతి పెద్ద విజయాలు…
ప్రేక్షకులు చారెడు ఆశిస్తే రాజమౌళి సినిమాల్లో బారెడు కంటెంట్ ఉంటుంది. ఆడియన్స్ అంచనాలకు మించి ఇవ్వడంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ 2022 అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అమెరికన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లోబల్ సినిమా వేదికలపై సత్తా చాటుతుంది. జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకొని భారతీయుల ఆస్కార్ ఆశలను మోసుకెళ్తుంది.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాటు మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, చిరంజీవి గాడ్ ఫాదర్ భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచాయి.
ఊహించని వైఫల్యాలు…
ఆర్ ఆర్ ఆర్ తో వైభవాన్ని చూసిన తెలుగు పరిశ్రమ ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాల పరాభవాలను కూడా చూసింది. చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య దారుణ పరాజయం చవిచూసింది. థియేటర్స్ నుండి రెండో రోజే తీసేసే పరిస్థితి ఆచార్య చిత్రం ఎదుర్కొంది. ఆచార్యతో పాటు రాధే శ్యామ్ భారీ నష్టాలు మిగిల్చిన చిత్రాల జాబితాలో నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన రాధే శ్యామ్ ప్రభాస్ కి మరో ప్లాప్ అంటగట్టింది. అంచనాల మధ్య విడుదలై దారుణ పరాజయం చూసిన మరో చిత్రం విజయ్ దేవరకొండ లైగర్. ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచిన ఈ చిత్రాలు బయ్యర్లను మొత్తంగా ముంచేశాయి.
సంచలనాలు…
అంచనాల మధ్య విడుదలైన పెద్ద సినిమాలు బయ్యర్లకు కన్నీరు ముగిస్తే… సందడి లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు కాసులు కురిపించాయి. సీతారామం, కార్తికేయ 2, బింబిసార అద్భుత విజయాలు నమోదు చేశారు. రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభాలు ఇచ్చాయి. ప్రేక్షకుల ప్రతి పైసాకు న్యాయం చేశాయి. కార్తికేయ 2 ఏకంగా పాన్ ఇండియా విజయం సాధించింది.
డబ్బింగ్ చిత్రాల హవా…
ఒకటికి నాలుగు డబ్బింగ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాయి. భాషా బేధాలు పక్కన పెట్టి థియేటర్స్ కి ఆడియన్స్ క్యూ కట్టారు. కెజిఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 కోట్లకు పైగా షేర్ సాధించి గత డబ్బింగ్ చిత్రాల రికార్డ్స్ తుడిచి పెట్టింది. వరల్డ్ వైడ్ కెజిఎఫ్ తెలుగు వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం ఊహించని పరిణామం. విక్రమ్ తో కమల్ హాసన్ డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. కమల్ అభిమానులు దశాబ్దాల తర్వాత థియేటర్స్ లో విజిల్ వేసిన మూవీ విక్రమ్. కాంతార గురించి చెప్పాలంటే అదో చరిత్ర. రూ. 2 కోట్ల పెట్టుబడికి రూ. 30 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రం అది. వీటితో పాటు సర్దార్, విక్రాంత్ రోణా, చార్లీ 777, లవ్ టుడే, బ్రహ్మాస్త్ర ఆదరణ దక్కించుకున్న డబ్బింగ్ చిత్రాల జాబితాలో చేరాయి.

వివాదాలు…
అనుకోని వివాదాలు 2022లో చిత్ర పరిశ్రమను చుట్టుముట్టాయి. టికెట్స్ ధరల విషయంలో పరిశ్రమ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సమస్యను చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ని కలిసి పరిష్కరించారు.
ఆచార్య బయ్యర్లు నష్టాలు చెల్లించాలంటూ ధర్నాకు దిగారు. ఆచార్య బిజినెస్ లో తలదూర్చిన కొరటాల శివ ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. చిరంజీవితో పాటు కొరటాలను ఆర్థికంగా ఆచార్య దెబ్బతీసింది. పరాజయం ఒకవైపు వివాదాలు మరోవైపు… కొరటాలపై చిరంజీవి అసహనానికి కారణమయ్యాయి.
లైగర్ విషయంలో ఆచార్య సీన్ రిపీట్ అయ్యింది. లైగర్ బయ్యర్లు నష్టాలు తిరిగి చెల్లించడం లేదని దర్శకుడు పూరీని నిలదీసే ప్రయత్నం చేశారు. ధర్నాలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తే ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వనని పూరి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక లైగర్ నిర్మాణం, వ్యాపార వ్యవహారాలలో ఆర్థిక నేరాలు జరిగాయనే అనుమానాలతో ఈడీ అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలను విచారించారు.
తాజాగా సంక్రాంతి చిత్రాలకు థియేటర్స్ పంపకాల విషయంలో దిల్ రాజు-మైత్రీ మూవీ మేకర్స్ మధ్య వివాదం నడుస్తోంది. దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్ అన్న పరిస్థితి నెలకొంది. దిల్ రాజు నేను తగ్గేదేలే అంటున్నాడు. రానున్న రోజుల్లో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త సరుకు…
ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ఇతర పరిశ్రమలకు చెందిన అందమైన భామలు తెలుగు ప్రేక్షకులను అందం, అభినయంతో మైమరిపిస్తారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో బాలీవుడ్ భామ అలియా భట్, బ్రిటిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మృణాల్ ఠాకూర్ సీతారామంతో మెస్మరైజ్ చేయగా… అనన్య పాండే మాత్రం లైగర్ తో నిరాశపరిచింది. 2022లో వీరితో పాటు కయాడు లోహర్, మిథిలా పార్కర్, గెహ్నా సిప్పి,సంయుక్త మీనన్, రజీషా విజయన్, సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.