Nandamuri Taraka Ratna: నలభై ఏళ్ళు కూడా నిండని తారకరత్న సీరియస్ హార్ట్ అటాక్ కి గురయ్యాడు. గుండెలో తొంభై శాతానికి పైగా బ్లాక్స్ ఏర్పడ్డాయి. రక్త ప్రసరణలో సంభవించిన ఇబ్బందులు కారణంగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యుల వివరణ ఇచ్చారు. అంత చిన్న వయసులో తారకరత్న ఈ సమస్య ఎందుకు వచ్చింది?. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు ఫిట్నెస్ పట్ల శ్రద్దగా ఉంటారు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారు. బాడీ షేపవుట్ అయితే నటుడిగా రాణించడం కష్టం. మరి తారకరత్నకు వ్యాయామం చేసే అలవాటు లేదా?. అసలు హెల్త్ చెకప్స్ చేయించుకోరా?… ఇలా పలు సందేహాలు చర్చకు వస్తున్నాయి.

ఈ క్రమంలో మానసిక వేదన, వ్యక్తిగత సమస్యలు కూడా కారణం కావచ్చు అంటున్నారు కొందరు. కెరీర్ విషయంలో తారకరత్న తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎన్టీఆర్ మనవడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తారకరత్న హీరో అయ్యారు. ఆయన్ని నందమూరి కుటుంబం గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఫస్ట్ మూవీ విడుదల కాకుండానే ఏకంగా తొమ్మిది సినిమాలకు ఆయన సైన్ చేశారు. కీరవాణి సంగీతం అందించిన ఒకటో నెంబర్ కుర్రాడు మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై తమ మార్క్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని అలరించినవారే స్టార్స్ అవుతారు. ఆయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో సైన్ చేసిన సినిమాలు కొన్ని పట్టాలెక్కలేదు. హీరోగా 20 సినిమాలు చేసినా తారకరత్నకు బ్రేక్ ఇచ్చే మూవీ పడలేదు. దీంతో ఆయన విలక్షణ పాత్రలు ట్రై చేశారు. అమరావతి చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఆ చిత్రానికి ఆయనకు నంది అవార్డు వచ్చింది. హీరోగా ఫేడవుట్ అయిన తారకరత్న వెబ్ సిరీస్లు చేస్తున్నారు.

హీరోగా సక్సెస్ కాలేకపోయాననే వేదన అయితే తనలో ఉంది. తారకరత్న వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది తక్కువే . ఆయన అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అలేఖ్య రెడ్డి-తారకరత్న చాలా అన్యోన్యంగా ఉంటారని సమాచారం. వీరి మధ్య మనస్పర్ధలు, గొడవలు జరిగిన దాఖలాలు లేవు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు బయటకు రావు కాబట్టి… మనం అంచనా వేయలేం. మొత్తంగా తారకరత్న అనారోగ్యం వెనుక మానసిక వేదన ఉందనే వాదన వినిపిస్తోంది.