
చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతున్నాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలో మాత్రం ప్రజలు మాస్కులు లేకుండా సందడి చేశారు. వుహాన్ లోని మాయా వాటర్ పార్క్ దగ్గర తాజాగా మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది.
ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు వేల సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఐతే ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరైన వాళ్లు ముఖానికి ఎటువంటి మాస్కులు ధరించకుండా సందడి చేయడం గమనార్హం. ఎటువంటి మాస్కులు ధరించకుండా సందడి చేసి వుహాన్ ప్రజలు అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందనే సందేశాన్ని ఇచ్చారు. 2019 డిసెంబర్ నెలలో వుహాన్ లోని మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.
దీంతో వుహాన్ నగరంలో 76 రోజుల పాటు లాక్ డౌన్ అమలైంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత సైతం అక్కడ కొన్నింటిపై ఆంక్షలు కొనసాగాయి. తాజాగా అక్కడి వాటర్ పార్కుకు అనుమతి ఇవ్వగా సందర్శకులను ఆకర్షించడానికి టికెట్లపై డిస్కౌంట్లు అమలవుతున్నాయి. మహిళా సందర్శకులకు ఆ ప్రాంతంలో ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూర్చాలని 400 పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది.
Meanwhile in #Wuhan
pic.twitter.com/Jt69CrNzzy— Josh K. Elliott (@joshkelliott) August 17, 2020