Uttarandhra TDP: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది ఉత్తరాంధ్రలో టీడీపీ వ్యవహార శైలి. ఎక్కడికక్కడే నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అధి నాయకత్వం ప్రోత్సహిస్తోందన్న టాక్ ఉంది. అదే పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు వ్యవహార శైలితో పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. దాదాపు శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో గ్రూపుల గోల వెనుక ఈ ఇద్దరు కీలక నాయకుల వ్యవహారమే కారణమన్న టాక్ నడుస్తోంది.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టిక్కెట్లను కన్ఫర్మ్ చేశారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో మాత్రం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని స్పష్టం చేశారు. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే కొన్ని నియోజకవర్గాల విషయంలో అంతర్గతంగా స్పష్టత ఉంది. అక్కడ తాజా మాజీలు పనిచేసుకుపోతున్నారు. ఇక్కడే కీలక నేతలు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాలపై ఆధిపత్యం చెలాయించేందుకు నియోజకవర్గాల్లో వేరే నేతలను ప్రమోట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్లలో కొత్త నేతలను అచ్చెన్నాయుడు ప్రమోట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. చాలామంది నాయకులు పోటీచేసేందుకు ముందుకొస్తున్నారు.అటువంటి వారికి అచ్చెన్న అభయం ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన ముద్ర వేసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు కళా వెంకటరావు సైతం రాజాం, పాలకొండతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అచ్చెన్నకు చికాకు తెప్పించేందుకు మరికొందరి పేర్లను తెరపైకి తెస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీలో కీలక నాయకుల మధ్య విభేదాలు ఉన్నా.. వారంత సమన్వయంతో పనిచేశారు. సర్వశక్తులూ ఒడ్డారు. తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేశారు. దాని ఫలితమే వైసీపీ అంతులేని విజయం. ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి హేమాహేమీలు ఉండేవారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రేంజ్ లో విభేదాలుండేవి. కానీ గత ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ఇటువంటి నేతలను గుర్తించి వారి మధ్య సమన్వయం ఏర్పాటుచేసింది. అటువంటి పరిస్థితే ఇప్పుడు టీడీపీలో ఉన్నా నాయకత్వం పట్టించుకోకపోవడం శ్రేణులను కలవరపెడుతోంది.

ఎదురుగా చూస్తే బలమైన అధికార పక్షం. ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార బలంతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలో విపక్షంలో ఉన్న టీడీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత జాగురకతగా ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవాలి. కానీ టీడీపీ మాత్రం అందిపుచ్చుకోవడం లేదు సరికదా.. కీలక నేతలే విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి విభేదాలు కలవరపెడుతున్నాయి. వాటిని సరిచేయాల్సిన నాయకత్వమే పెంచి పోషిస్తుండడం, ప్రోత్సాహం అందిస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు తెగ ఆందోళన చెందుతున్నారు. నాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.