
Pawan Kalyan: జీవితంలో ఏదైనా సాధించాలంటే ధృడమైన సంకల్పం అవసరం. మంచి సంకల్పానికి మన ప్రయత్నం తోడైతే అద్భుత విజయం సొంతమవుతుంది. అంతా మంచే జరుగుతుంది. నలుగురికి మంచి చేస్తుంది. ఎక్కడైనా.. ఏ రంగంలోనైనా ఇది సాధ్యమే. ఇటువంటి కచ్చితమైన అభిప్రాయంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని తాను ఆశించనని..దాని ఫలితం దక్కే వరకూ అలుపెరగకుండా పోరాటం చేస్తునే ఉంటానని స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా నమ్మకం సాధించాలంటే దశాబ్దాల సమయం పడుతుందని చెబుతున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’కు పవన్ హాజరయ్యారు. గత వారం ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. తాజాగా రెండో ఎపిసోడ్ విడుదలైంది. పవన్ కీలక అంశాల్లో తన మనోగతాన్ని వెల్లడించారు.
Also Read: MLA Vasantha Krishna Prasad: వైసీపీకి వసంత కూడా గుడ్ బై.. ఈ అసంతృప్తులకు అసలు కారణమేంటి?
అధికారం దక్కని చాలా సమూహాలకు సాధికారిత దక్కాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరమని భావించిన జనసేనను స్థాపించినట్టు పవన్ చెప్పారు. ఇప్పటికే ఉన్న పార్టీలు వేరే సిద్ధాంతాలతో పనిచేస్తున్నందున.. కొత్త తరం కోసం, దశాబ్దాలుగా అధికారం కోసం వేచిచూస్తున్న సమూహాల కోసమే తాను పార్టీ పెట్టానని గుర్తుచేశారు. అధికారం దక్కినా.. దక్కకున్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే పరితపిస్తున్నానని..పార్టీ అధికారంలోకి వస్తుందా? రాదా? అన్న ప్రశ్న తలెత్తకుండా పనిచేసుకుంటూ పోతున్నానని పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆటుపోట్లు ఎదురవుతున్నా తట్టుకొని ముందుకు సాగగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
అయితే జనసేన పార్టీ పెట్టడానికి ప్రేరణ మాత్రం ఒకేఒక ఘటనగా పవన్ చెప్పుకొచ్చారు. ‘నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉండేది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ రక్షిత మంచినీటిని అందించాలని సంకల్పించా. అక్కడకు కొంతమంది ప్రతినిధులను పంపించా, కానీ అక్కడున్న రాజకీయ శక్తులు దానిని అడ్డుకున్నాయి.మంచి చేయడానికి ప్రయత్నిస్తే ఈ అడ్డంకులు ఏమిటి? ఎన్జీవో లాంటిది స్థాపించాలనకున్నా. కానీ దానికి మించినది చేయాలని మదిలోకి వచ్చింది. అలా వచ్చిందే జనసేన పార్టీ’…అంటూ నాటి ప్రేరణను చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

సినిమారంగంలో వచ్చిన స్టార్ డమ్ రాజకీయంగా వచ్చే అవకాశమే లేదని.. అది ఒక ఎన్టీఆర్, ఎంజీ రామచంద్రన్ లకే సాధ్యమైందని పవన్ చెప్పారు. ఆ విషయంలో తనకు పరిపూర్ణమైన స్పష్టత ఉందని కూడా ఒప్పుకున్నారు. తనపై రామ్ మనోహర్ లోహియా, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభావం అధికంగా ఉందన్నారు. అందుకే పడిలేచిన చోటే మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. గత ఎన్నికల్లో రెండుచోట్ల ప్రజలు ఆదరించకపోయినా నిలబడిన విషయాన్ని గుర్తుచేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ తాను రాజకీయాలు నేర్చుకుంటున్నాని కూడా చెప్పారు.
Also Read: KCR- MIM: కేసీఆర్‌కు ఎంఐఎం పరీక్ష.. ‘అసద్’ దోస్తా.. దుష్మనా?
