
Farmers Strike: ‘దేశంలో కరెంట్ ఉంటే వార్తం. తెలంగాణలో కరెంట్ పోతే వార్త. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీఆఎస్‌కు అధికారం ఇస్తే.. దేశంలో రైతులందరికీ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తం’ మైక్ పట్టుకున్న ప్రతీసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి మొదలు.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలివీ. ‘పవరే… మమ్మల్ని పవర్‌లోకి తెస్తోంది.. మేం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూనే ఉంటం.. రాతులు మాకు అధికారం ఇస్తూనే ఉంటరు’ అంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువుకు తోడు కరెంటు కోతలతో కష్టాలు పడ్డ రైతులు తెలంగాణ వచ్చాక కరువు పోయింది.. కరెంటు కోతలు తాగ్గాయి అని ఇన్నాళ్లూ భావించారు. సీఎం అయితే తెలంగాణలు సర్‌ప్లస్ పవర్ జనరేట్ అవుతోందని పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, కేసీఆర్ కరెంటు స్వప్నం కరిగిపోతోంది. వరుసగా గులాబీ పార్టీని రెండుసార్లు పవర్‌లోకి తెచ్చిన ‘పవరే’.. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పవర్‌లో నుంచి దించేలా కనిపిస్తోంది. వేసవి ప్రారంభానికి ముందే పెరిగిన కరెంటు కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అన్నదాతలో వ్యక్తమవుతోంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడానికి అసలు ప్రేరణ ఇదీ
24 గంటల కరెంటుకు బ్రేక్..
ఎన్నికలకు ఇంకా పది నెలల సమయమే ఉంది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ నేతలు త్వరలో ప్రజల దగ్గరకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కరెంట్ కష్టాలు ప్రారంభం కావడం గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడటంతో 24 గంటల విద్యుత్ సరఫరాను అనధికారికంగా నిలిపివేశారు. త్రీఫేస్ విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయడం లేదు. సింగిల్ ఫేస్ మాత్రం 24 గంటలు ఇస్తున్నారు. వ్యవసాయానికి నాలుగు గంటలకు మించి కరెంటు సరఫరా చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి కరెంటు సరఫరాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నాటి పరిస్థితులు గుర్తు చేస్తున్నారు. ఒకరిద్దరు రైతులు కూడా రాత్రి కరెంటుకు బలయ్యారు.
అసెంబ్లీ 24 గంటల కరెంటుపై అబద్ధాలు..
ఇదిలా ఉంటే రైతుల పక్షాన వ్యవసాయానికి కరెంటు కోతలపై అసెంబ్లీలో విపక్షాలు అధికార బీఆర్‌ఎస్‌ను నిలదీశాయి. అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ, అధికార పక్షం కరెంటు కోతలే లేవని చెబుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్ అయితే.. విపక్షాలపై ఎదురు దాడికి దిగుతున్నారు. ‘కరెంటు తీగలు పట్టుకోండి.. కరెంటు కోతలు ఉన్నాయో.. లేదో తెలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ఇక ఇతర శాఖల మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం.. 24 గంటల కరెంటుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని, దేశంలో కేసీఆర్‌కు మాత్రమే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రిని పొగిడేందుకు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు.

రైతులకు అండగా విపక్షాలు..
మరోవైపు కరెంటు కోసం రోడ్లు ఎక్కుతున్న రైతులకు విపక్షాలు అండగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌టీపీ, బీఎస్పీ రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. సబ్‌స్టేషన్ల ముట్టడికి పిలుపునిస్తున్నాయి. రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని.. రోడ్లను బ్లాక్ చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. సబ్‌స్టేషన్ల ముట్టడికి కూడా ఆ పార్టీ పిలుపునిచ్చింది.
వాస్తవ పరిస్థితి చూస్తే కరెంట్ డిమాండ్ పెరుగుతుండడం, ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం కరిగిపోతోందని తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. సమ్మర్‌లో మరిన్ని తీవ్రమైన కష్టాలను తెలంగాణ ఎదుర్కోక తప్పదు. అప్పటికి ఎన్నికలు మరింత దగ్గరవుతాయి. సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్‌ఎస్ పవర్ కట్ చేయడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read:KCR- MIM: కేసీఆర్‌కు ఎంఐఎం పరీక్ష.. ‘అసద్’ దోస్తా.. దుష్మనా?