Monsoons : రుతుపవనాలు ఇసారి దోబూచులాడుతున్నాయి. ఇప్పటికే ఆలస్యంగా వేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు మందగమనంతో వర్షాలు కురవడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా చినుకుల కోసం ఆకాశంవైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రుతుపవనాలు విస్తరించకపోవడంతో వర్షాలు కురవకపోగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం వేడికి అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వర్షాలపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ షాకింగ్ న్యూస్ చెప్పింది.
మరో నాలుగు వారాలు కష్టమే..
దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రభావం నాలుగు వారాల వరకు అంతగా ఉండదని స్కైమేట్ తెలిపింది. ఈసారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయంపై అధాపడే రైతులకు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేసింది. స్కైమెట్ అంచనా ప్రకారం జూలై 6 వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. వర్షాధర పంటైన వరి సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మధ్య, పశ్చిమ భారత్ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆలస్యంగా రుతుపవనాల రాక..
సాధారణంగా జూన్ 1న రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి వారం ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. అరేబియా సముద్రంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాన్ కారణంగా ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినట్లు స్కైమేట్ తెలిపింది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా లేవని.. మందకొండిగా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపనాలు నెమ్మదిగా కదిలితే.. మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బిహార్ లో జూన్ 15 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమని తెలిపింది.
ఆల్పపీడనాలు ఏర్పడితే వేగం..
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే రుతుపవనాల్లో వేగం పెరగొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.