NTV Vs TV9: మొన్ననే మనం చెప్పుకున్నాం కదా టీవీ9 ను ఎన్టీవీ బీట్ చేసిందని.. నెంబర్ వన్ స్థానాన్ని మళ్లీ లాగేసుకుందని.. రెండు కోట్లు పెట్టి టీవీ9 యాజమాన్యం “నెంబర్ వన్” వేడుకలు ఘనంగా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. కానీ ఈసారి బార్క్ రేటింగ్స్ (ఇవేం సుద్దపూసలు కాదు) చూస్తే టీవీ9 ఇప్పుడే కాదు సమీప భవిష్యత్తులోనూ ఎన్ టీవీ ని బీట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.. వాస్తవానికి టీవీ9 ఛానల్ కు మొదట్లో మంచి పేరు ఉండేది. పెద్ద పెద్ద తలకాయలు వెళ్లిపోవడంతో ఆ చానల్లో క్రియేటివిటీ చచ్చిపోయింది. విషయానికంటే ఆర్భాటానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ఛానల్ పై జనాల్లో ఏవగింపు మొదలైంది. ప్రసారాల్లో కూడా నాణ్యత లేకపోవడంతో అది ఆ ఛానల్ ను దారుణంగా దెబ్బతీస్తోంది. ఫలితంగా ఒకప్పుడు నెంబర్ వన్ స్థానాన్ని అనుభవించిన ఆ ఛానల్ ఇప్పుడు అనామకంగా రెండవ స్థానానికి పడిపోయింది. గతంలో రెండవ స్థానానికి పడిపోయినప్పుడు మళ్లీ ఎన్ టీవీ ని బీట్ చేసి మొదటి స్థానానికి వచ్చింది. కానీ అది రెండు వారాల ముచ్చటయ్యింది.
ఇవీ తాజా రేటింగ్స్
ఇటీవల టీవీ9ను బీట్ చేసి ఎన్ టీవీ మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చినప్పుడు రెండు చానల్స్ మధ్య అంతరం కేవలం ఐదు అడుగులు మాత్రమే. అదే 23 వ వారానికి వచ్చేసరికి రెండు ఛాన్స్ మధ్య పాయింట్లు వ్యత్యాసం 23 కు పెరిగిపోయింది. ఇక జిఆర్పి రేటింగ్స్ విషయంలో అదే ఐదు పాయింట్ల తేడా కనిపిస్తున్నప్పటికీ.. వారాల విషయానికి వచ్చేసరికి భారీ తేడా కొట్టేస్తోంది. కుట్రలతో, కుతంత్రాలతో నెంబర్ వన్ స్థానం ఎవరూ కొట్టయ్యలేరు అని ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటుచేసిన టీవీ9 ఆ స్థానాన్ని పువ్వుల్లో పెట్టి ఎన్ టీవీకి అప్పగించడమే ఇక్కడ గమనించాల్సిన విషయం.
నాణ్యత కొరవడింది
ఒకప్పుడు టీవీ9 లో వార్తలు వస్తున్నాయి అంటే జనాలకు ఒకరకమైన ఆసక్తి ఉండేది. అప్పట్లో రవి ప్రకాష్ ఆధీనంలో ఛానల్ ఉండేది కాబట్టి ప్రసారాల విషయంలో కొద్దో గొప్పో నాణ్యత ఉండేది. ఎప్పుడైతే రవి ప్రకాష్ బయటికి వెళ్ళగొట్టబడ్డాడో అప్పుడే అది ఆ ఛానల్ పై ప్రభావం చూపింది. ఇదే సమయంలో ఎన్టీవీ చాప కింద నీరు లాగా విస్తరించింది. వాస్తవానికి టీవీ9 నెట్వర్క్ తో పోలిస్తే ఎన్టీవీ నెట్వర్క్ విస్తృతి చాలా తక్కువ. అయినప్పటికీ తనకు మాత్రమే సాధ్యమైన ప్లైన్ అండ్ క్లీన్ కవరేజ్ తో ఎన్టీవీ దూసుకుపోతోంది. 23వ వారానికి వచ్చేసరికి ఏకంగా 80 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి మొన్నటి రేటింగ్స్ ప్రకారం టీవీ9 ఎన్ టీవీ ని బీట్ చేయడం ఈజీ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక వారం గడిచిందో లేదో ఎన్ టీవీ మరింత మెరుగైన రేటింగ్ సంపాదించింది.
కీలకమైన వారు వెళ్ళిపోతున్నారు
మొన్ననే మనం చెప్పుకున్నాం కదా టీవీ9 లో కీలకమైన వికెట్లు టపా టపా ఎగిరిపోతున్నాయని.. రజనీకాంత్ కు కుడి, ఎడమ భుజాల్లాంటి అశోక్ వేములపల్లి, దొంతు రమేష్ ఆల్రెడీ టీవీ9 నుంచి బయటికి వెళ్లిపోయారు. దొంతు రమేష్ నరేంద్ర చౌదరి క్యాంపులో చేరిపోయాడు. ఎన్ టీవీలో అతడికి టీవీ9 తో పోలిస్తే మూడు రెట్లు అధిక ప్యాకేజీ ముట్ట చెబుతున్నారని సమాచారం. ఇక వేములపల్లి అశోక్ తన గురువైన రవి ప్రకాష్ ఛానల్లో చేరబోతున్నాడని తెలుస్తోంది. వీరే కాకుండా గణేష్, రాజశేఖర్ అనే కీలకమైన వ్యక్తులు కూడా టీవీ9 నుంచి ఎన్టీవీ లోకి వెళ్లిపోయారు. టీవీ9 నుంచి అగ్రస్థానం మాత్రమే కాదు కీలకమైన వ్యక్తుల్ని కూడా ఎన్టీవీ నరేంద్ర చౌదరి లాగేసుకుంటున్నాడు. ఇక మిగతా ఛానల్స్ విషయానికి వస్తే మొదటిదాకా అరి వీర భయంకరమైన లెవల్లో నాలుగో స్థానానికి వచ్చిన టీ న్యూస్ ఆరవ స్థానానికి పడిపోయింది. యాదృచ్ఛికంగా టీవీ 5 మూడవ స్థానంలో కొనసాగుతోంది. వి6 నాలుగో స్థానంలో ఉంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ ఏబీఎన్, వీ6 కు పాయింట్లు విషయంలో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ 23వ వారంలో వి6 మూడు పాయింట్ల అధిక వ్యూస్ నమోదు చేసింది. ఇక మిగతా చానల్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక పత్రికా రంగంలో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్న ఈనాడు, సాక్షి.. ఎలక్ట్రానిక్ మీడియా విషయం వచ్చేసరికి 7, 8 స్థానాల్లో కొనసాగుతుండడం ఇక్కడ విశేషం.