Union Budget 2023 AP And Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొందరికి మోదం.. కొందరికి ఖేదం అన్నట్టు ఉంది. ఎప్పటిలాగే అధికార పక్షం చప్పట్లు కొడితే.. ప్రతిపక్షం అంకెల గారడీ అంటూ నిట్టూర్చింది. అధికార, ప్రతిపక్షాల వాదనలు పక్కనపెడితే.. అంతిమంగా ఇది ఎన్నికల బడ్జెట్ అని తేలింది. మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీ, తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో ఎవరికెంత కేటాయింపు జరిగిందో కింది స్టోరీలో చదివేయండి.

కేంద్ర బడ్జెట్ 2023-24ను నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వివిధ వర్గాలు, రాష్ట్రాలకు కేటాయింపులు జరిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిర్మలాసీతారామన్ గొప్పగా కీర్తించారు. యువత, మహిళ, ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాలకు ఆశాదీపంగా బడ్జెట్ ను అభివర్ణించారు. పేదలు, సామాన్యుల బడ్జెట్ గా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాశానికెత్తారు. చారిత్రాత్మక బడ్జెట్ గా అభివర్ణించారు. నిర్మలాసీతారామన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
వివిధ రాష్ట్రాల్లాగే ఏపీ, తెలంగాణకు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41,338 కోట్లుగా ఉంది. తెలంగాణ వాటా రూ. 21470 కోట్లుగా ఉంది. వివిధ రంగాలకు గాను ఏపీ, తెలంగాణకు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 47 కోట్లు కేటాయించారు. పెట్రోలియం యూనివర్శిటీకి రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 683 కోట్లు కేటాయించారు. అదే సమయంలో తెలంగాణకు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. సింగరేణికి రూ. 1650 కోట్లు కేటాయించగా.. మణగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ . 1473 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ కు రూ. 300 కోట్లు కేటాయించారు.

ఏపీ, తెలంగాణకు బడ్జెట్లో అరకొర కేటాయింపులే జరిగాయని చెప్పవచ్చు. ఏపీ రెవెన్యూలోటు భర్తీ, విభజన చట్టంలోని హామీలకు పూర్తీ స్థాయిలో కేటాయింపులు జరగలేదని చెప్పవచ్చు. అదే సమయంలో తెలంగాణ విషయంలోనూ అరకొర కేటాయింపులు జరిగాయని చెప్పవచ్చు. త్వరలో ఎన్నికలు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణకు గత బడ్జెట్లలాగే నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.