
AP Capital Issue: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అధికార పార్టీ నేతలు విభిన్న ప్రకటనలు ఇస్తూ ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి, అమరావతి అంశాన్ని పక్కన పెట్టేశారు. విశాఖ నుంచి పరిపాలన అంటూ తాడేపల్లి నుంచి అధికారాలు చెలాయిస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మాట నెగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
స్పష్టత లేని మాటలు…
ముఖ్యమంత్రి జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అని అంటున్నారు. వైసీపీ మంత్రులు సైతం అందుకు పలు సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు కూడా. ఈ అం
శంపై ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాదర్ నోరు జారారు. విశాఖ రాష్ట్రానికి రాజధాని అంటూ తేల్చి చెప్పారు. వికేంద్రీకరణ అంశం వైసీపీ అజెండాలో లేదనేది ఆ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవడంతో, పెద్ద దుమారమే రేగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల మరో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ అమరావతిని వ్యతిరేకించాలనేది వైసీపీ విధానం కాదని అన్నారు. మూడు రాజధానుల ఎజెండాతోనే ఎన్నికలకు వస్తాం అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఓకే చెప్పి.. ఆ తరువా నో
వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని ఎక్కడైతే బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ అమరావతిని రాజధానిగా ఓకే చెప్పారు. తాడేపల్లిలోనూ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాజధాని ఒక్కచోట కాదు వికేంద్రీకరణ జరగాలని కూడా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు ఉండాలని స్వరం మార్చి చంద్రబాబుపై సూటిగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

ఇదంతా ఎందుకు
ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వైసీపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెరలేపారు. పరిపాలన విశాఖ నుంచి, అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో ఉంటుందని ఎక్కడికక్కడ ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధమైన రాజధానిని నిర్మాణం చేపట్టే అంశాన్ని మరగునపడేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ద్వంద వైఖరిని అవలంబిస్తోంది. రాజధాని నిర్మాణం జరగాలంటే కేంద్రమే నిధులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి జగన్ మాత్రం సంక్షేమ పథకాల కోసమే ఢిల్లీకి వెళ్లి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు రాజధాని కోసం నిధులు అడిగిన దాఖలాల్లేవు. మొత్తానికి రాజధాని లేని దిక్కు రాష్ట్రంగా మార్చి ప్రతిపక్షాలపై ఒంటి కాలిపై వెళ్లడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.