Tollywood Heroines: మాటల్లో పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అంటారు. చేతల్లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య అసలు సఖ్యత ఉండదు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ సరదాగా కలిసిన పాపాన పోరు. ఏదైనా అవసరం కోసమో, సందర్భం కుదిరితేనో మినహాయించి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉండవు. ఒకప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. అప్పటి నటుల ప్రవర్తన మేమంతా ఒక కుటుంబం అన్నదాన్ని సార్ధకం చేసినట్లుండేది. సావిత్రి, జమున, కృష్ణకుమారి జనరేషన్స్ నుండి విజయశాంతి, రమ్యకృష్ణ జనరేషన్స్ వరకు హీరోయిన్స్ మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి.

అక్కా చెల్లి అనే పిలుపులు చోటు చేసుకునేవి. ప్రొఫెషనల్ నుండి పర్సనల్ వరకూ అన్ని విషయాలు పంచుకునేవారు. తరచుగా ఒకరింటికి మరొకరి రాకపోకలు ఉండేవి. ఆ కల్చర్ ముగిసి చాలా కాలం అవుతుంది. హీరోయిన్స్ ఎంపికలో వచ్చిన మార్పులు, పరిశ్రమ విస్తరించడం వంటి కారణాలతో హీరోయిన్స్ నడుమ సాన్నిహిత్యం లేకుండా పోతుంది. గతంలో తెలుగు సినిమా అంటే దాదాపు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఉండేది. ఇప్పుడు.. దేశంలో నలుమూలల నుండి టాలీవుడ్ కి అమ్మాయిలు దిగుమతి అవుతున్నారు.
వాళ్లకు భాష రాదు. ఇక్కడ కల్చర్ తెలియదు. బాగా కమర్షియల్ గా ఉంటారు. నటించామా? డబ్బులు తీసుకున్నామా? తిరిగి సొంతూరు చెక్కేశామా? అన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ని పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి చెందినవారు. సమంత చెన్నై అమ్మాయి. రష్మిక మందానది కర్ణాటక. ఇక పూజా హెగ్డే కన్నడ మూలాలున్న ముంబై అమ్మాయి. రకుల్ ది ఢిల్లీ, కాజల్ ముంబై అమ్మాయి. ఇక తమన్నా విషయానికి వస్తే ముంబైకి చెందిన హీరోయిన్.

ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కృతి శెట్టి, శ్రీలీల బెంగుళూరు భామలు. ఇలా వివిధ నేపథ్యాలు, ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలు వీరు. వారి మధ్య స్నేహం ఆశించడమంటే వింతే అవుతుంది. తోటి నటులతో ఎమోషనల్ బాండింగ్ లేకుండా యాంత్రికంగా పనిచేయడం వలన అలసిపోతారు. అదే సమయంలో కెరీర్ కి ఎక్కువ మైలేజ్ రాదు. గత రెండు దశాబ్దాల్లో పట్టుమని పదేళ్లు హీరోయిన్ గా ఉన్న అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. తమన్నా, కాజల్ ఒకరిద్దరు మాత్రం లాంగ్ కెరీర్ కలిగి ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం సూత్రం మరచి హీరోయిన్స్ తెలియకుండానే నష్టపోతున్నారు.

హీరోయిన్లు ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీలో ఉండకపోవడానికి మరో కారణం కూడా ఉంది. హీరోయిన్లకు తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దానితో అభద్రతా భావం కూడా ఎక్కువే. గ్లామర్ రోల్స్ కే వాళ్ళని పరిమితం చేస్తున్నారు కాబట్టి, అందమైన కొత్త అమ్మాయిలు తో ఎప్పుడైనా వీళ్లకు పోటీ ఉంటుంది.
మరోలా ఆలోచిస్తే… మన హీరోస్ ఇంత స్ట్రాంగ్ కాబట్టి, సినిమా అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి, మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు హీరోయిన్లకి తక్కువే. సమంత లా కొద్ది మందికి మాత్రమే సాధ్యమైంది. వారి చుట్టు బలమైన కథలు వస్తుండడం.. వారు అవే చేస్తుండడంతో ఎక్కువ కాలం మనుగగలుగుతున్నారు. ఇక సమంత ఒక పెద్దింటి కోడలుగా మొన్నటివరకూ ఉన్నారు. ఆ బలమైన నేపథ్యం కూడా ఆమె ఇండస్ట్రీలో మొదట్లో ఎదగడానికి కారణమైంది. ఆ తర్వాత విడిపోయినా ఆ పరిచయాలు బలంగా నిలబడడంతో ముందుకు సాగుతోంది.
ఇలా హీరోయిన్లకు హీరోల పోలిస్తే స్వేచ్ఛ స్వాతంత్య్రాలు, పరిమిత కాలాలు చాలా తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తీరుగా హీరోయిన్లు ప్రవర్తిస్తున్నారు.