Ram Charan- Susmitha: చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. గత ఏడాది చివర్లో చిరంజీవి ఈ శుభవార్త తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇది మెగా అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపింది. రామ్ చరణ్ కి వివాహమై 10 ఏళ్ళు దాటిపోయింది. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఏళ్ళు గడిచిపోతుంటే చరణ్ పిల్లల్ని కంటారా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు, అపోహలకు చరణ్ దంపతులు చెక్ పెట్టారు. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్, ఉపాసనల జీవితంలోకి కొత్త సభ్యుడు వస్తున్నాడు.

చరణ్ తండ్రి కావడం కుటుంబ సభ్యులకు ఎక్కడ లేని సంతోషం తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్క గారైన సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇది మా కుటుంబంలో అతి పెద్ద పండగ. పాప, బాబు ఎవరు పుట్టినా సంతోషమే. అయితే అబ్బాయి పుడితే బాగుండు. మా ఫ్యామిలీలో ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అందుకే ఈసారి అబ్బాయి కావాలనిపిస్తుందని సుస్మిత అన్నారు.
కాగా సుస్మిత సైతం చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు. తండ్రి చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సైరా, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో చిరంజీవి కాస్ట్యూమ్స్ సుస్మిత డిజైన్ చేసినవే. అలాగే నిర్మాతగా కొన్ని చిత్రాలు, సిరీస్లు తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సినిమా వారసత్వాన్ని సుస్మిత ఆ విధంగా కొనసాగిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సుస్మిత అద్భుతంగా మాట్లాడారు.

వాల్తేరు వీరయ్య లో చిరంజీవికి వింటేజ్ లుక్ రావడానికి ఆమె రూపొందించిన కాస్ట్యూమ్స్ కారణమయ్యాయి. వాల్తేరు వీరయ్య మూవీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతూ… డైరెక్టర్ బాబీ నాకు చిరంజీవి వింటేజ్ లుక్ కావాలి అన్నారు. అందుకు అనుగుణంగా బట్టలు రూపొందించామన్నారు. మేము చిన్నప్పటి నుండి నాన్నగారి సినిమాలు చూసి పెరిగాము. అందుకే పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. మా పని ఈజీగానే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదలైన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది.