Uttarandhra Fight: ఉమ్మడి ఏపీలో వెనుకబాటుకు, దోపిడీకి గురైన తెలంగాణ స్వరాష్ట్రం కోసం నినదించింది. సాధించింది. ఇప్పుడు ఏపీలో మరోచిచ్చు మొదలైంది. తెలంగాణ లాగానే వెనుకబాటుకు గురైన ‘ఉత్తరాంధ్ర’ స్వరాష్ట్ర కాంక్షను వ్యక్తం చేస్తోంది. ఉత్తరాంధ్ర నాయకుల్లో సొంత రాష్ట్రం కావాలన్న డిమాండ్ మొదలైంది. ఇప్పుడీ డిమాండ్ ఆ రాష్ట్రాన్ని దావానంలా వ్యాపించి మరో రాష్ట్రానికి పురుడు పోస్తుందా? ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

పాలకుల వివక్షాపూరిత, నిర్లక్ష్య వైఖరి వల్ల… ప్రాంతాల విభజన అనివార్యం అవుతోంది. స్వతంత్ర్య దేశంలో మెజారిటీ రాష్ట్రాల విభజన అంతా అలాంటిదే. సుమారు ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ కూడా… అలానే విడిపోయింది. తమ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్రంగా అన్యాయానికి గురవుతోందని దశాబ్దాల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. విభజన ఏపీలో మరోసారి అలాంటి ఉద్యమానికి పాలకులు కారణమవుతున్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రని.. ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏకంగా అధికార వైసీపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఉద్యమానికి ఉవ్వేత్తున సాగించేందుకు సాకారం అందినట్లువుతోంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోరుకునే అంశంలో నిజాయితీ ఉందా…? పాలకుల వల్లే నేటికి వివక్షకు గురవుతూ వెనకుబాటుని ఆ ప్రాంతం వాసులు అనుభవిస్తున్నారా…? అక్కడి నుంచి ఇప్పటికీ… ఇతర రాష్ట్రాలకు వలసలకు కారణం ఏంటి..? పుష్కల వనరులు ఉన్నా.. ఎందుకు పాలకులు ఉపయోగించుకొని అభివృద్ధి చేయలేకపోతున్నారు.?
-ఆకాంక్ష ఆసన్మమైంది!
ఉత్తరాంధ్ర ప్రజల మనుగడకూ, వారి ఆకాంక్షకూ, స్వప్నానికీ ఏమవుతున్నదో, ఏ పాలకుల నిర్లక్ష్యపు పదఘట్టనలో తమ నేల ధ్వంస మైపోతున్నదో గుర్తించవలసిన చారిత్రక సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారు. పురోభివృద్ధి సాధించవలసిన ప్రాంతానికి అవసరమైన అన్ని సహజ వనరులూ ఉండీ ఎందుకు నానాటికీ వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నదో…. తెలుసుకోవలసిన చారిత్రక సమయం ఇదేనని అనిపిస్తోంది. ఈ ప్రాంతం పట్ల పాలకుల నిర్లక్ష్యం.., వనరుల విధ్వంసం.., అభివృద్ధి రాహిత్యం అనే ముప్పేట దాడిని అడ్డుకోవడం ఉత్తరాంధ్ర బిడ్డలుగా అందరిదీ. బానిసత్వం విడనాడి, నాటి స్వతంత్ర్య పోరాటంలో సిక్కోలు బిడ్డలు చూపిన మరోసారి చూపించే సమయం ఆసన్నమైందని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
-ఉత్తరాంధ్ర భౌగోళిక పరిస్థితి
ఆంధ్రలోని ఉత్తర భాగంలో ఉత్తరాంధ్ర ఉంటుంది. ఈ ప్రాంతం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిధిలో విస్తరించి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణంలో భాగంగా కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలు ఏర్పడ్డాయి. ఉత్తరాంధ్ర ప్రస్తుతం ఆరు జిల్లాలుగా మనుగడలో ఉంది. ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే ఏపీ విస్తీర్ణం, జనభా పరంగా.. 15 శాతం, 19 శాతంగా ఉన్నాయి. ఇక్కడ పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలవాల్సి ఉంది. కానీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల న్యాయంగా రావలసిన వాటా దక్కని దుస్థితి. తమ వాటా తమకు దక్కలేదని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమించినప్పుడు, ఆ సమస్య పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రస్పుటంగా ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఎంతగా వెనుకబడి ఉన్నదో గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయతీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నమ్మబలికారు. కానీ ఎక్కడా జరగలేదు.
విస్తారమైన సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శ్రమశక్తి పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రనే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడడం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు ఒక్కటీ లేవు. వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను ఎలుగెత్తవలసిన అవసరం వస్తోంది. ఇదే ప్రత్యేక రాష్ట్రకాంక్ష వైపు నడిపిస్తోంది.
-ఉత్తరాంధ్రలో ప్రవహించే నదులు
అన్నిటికన్నా ప్రధానమైన ఉత్తరాంధ్ర ఆకాంక్ష జల వనరులు. బాహుశా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నరవ గెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకూ, నిత్యం ప్రవహించే సెలయేళ్లకూ నిలయం ఈ ప్రాంతం. రాష్ట్రం మొత్తంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలోనూ లేవు. దాదాపు యాబై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలకూ కాలువల కింద నీటిపారుదల సౌకర్యం లేదు.

– అధికంగా గిరిజనులు-ఆదివాసీలే
ఇక్కడ గణనీయంగా ఆదివాసీ జనాభా ఉంది. వీరి అభివృద్ధి కోసం 2012లో విడుదల చేసిన అరకు డిక్లరేషన్- ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి సవివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఉత్తరాంధ్రకు ఉన్న 340 కిలోమీటర్ల సముద్రతీరాన్ని సముద్రం మీద ఆధారపడిన ప్రజల అభివృద్ధికి ఏ ప్రభుత్వాలు కనీస తోడ్పాటు ఇవ్వటం లేదు. సముద్ర తీరంపై మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలటం లేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుచ్ఛక్తి, రవాణా, ప్రభుత్వరంగ పరిశ్రమలు, వలసలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకుని పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది.
-సిక్కోలు బిడ్డల వలసలు
2016-17 ఆర్థిక సర్వే ప్రకారం.. భారతదేశంలో పది కోట్ల మంది వలస కార్మికులున్నారు. వారిలో 22 లక్షల మంది ఉత్తరాంధ్ర వారే. బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తున్నారు. ఇన్నేళ్లలో ఎందుకు ఈ వలసల్ని ఆపలేదని ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, అక్కడ పాలకుల్ని ప్రశ్నించినా సమాధానం మాత్రం రాదు. ఉత్తరాంధ్ర నాయకులు.. ప్రభుత్వ పెద్దల వద్ద ఊడిగం చేయటం వల్లే ఈ దుస్థితికి కారణమని ప్రజలకు కూడా గుర్తించాలి.
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం తెరమీదకి రావటం, పాలన రాజధానిగా విశాఖను ఎంపికచేయడం.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి ధర్మాన విశాఖ రాజధాని చేయండి.. లేకుండా ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని తీవ్ర స్వరంతో అడిగారు. దీంతో ప్రజల్లోనూ ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలనే అలోచన రాకమానదు. అక్కడి వెనకుబాటు తనం, తెలంగాణ ఉద్యమ స్పూర్తితో పోరాడవచ్చు. ఇటు రాయలసీమ ప్రాంత నాయకులు, ప్రజలకు కూడా తమ వెనకుబాటుకు గురయ్యామనే భావన ఉంది. దీంతోనే వీరు ప్రత్యేక రాయలసీమకు డిమాండ్ చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో ఏపీ మూడు ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలంగాణ విడిపోయినట్టే ఉత్తరాంధ్ర కూడా విడిపోనూ వచ్చు. ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.