
YCP: కలసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుందంటారు. ఏపీలో ప్రతిపక్షాలను హింసపెడుతున్న అధికార పార్టీ ఎత్తుగడలు ముందు ఫలితాలిచ్చినా ప్రస్తుతం అడ్డం తిరుగుతున్నాయి. వైసీపీకి ప్లస్ అయినవన్నీ ఇప్పుడు మైనస్ అవుతున్నాయి. అష్ట దిగ్బంధం చేసి ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కోలుకోలేని విధంగా చేయాలన్న వ్యూహం వికటిస్తోంది. వైసీపీ సృష్టించిన భయకంపిత వాతావరణం, ప్రతిపక్షాల అస్తిత్వంపై ప్రభావం చూపుతుంటుండటంతో ఏకమయ్యే సదావకాశాన్ని కల్పించాయి.
ఆర్థిక మూలాలపై దాడులు..
వైసీపీ అధికారంలోకి రాగానే, ప్రజా వేదికను కూల్చివేతతో మొదలుపెట్టి, ఆ తరువాత వరుసగా టీడీపీ నేతలపై కేసులు బనాయించడం మొదలుపెట్టారు. ఆర్థిక మూలాలపైనా దృష్టి పెట్టారు. ఐటీ దాడులు, కేసులతో ఊపిరిసలపనివ్వకుండా చేసి, రాజకీయంగా బలహీనులు చేసి వైసీపీని ప్రజల్లో బలంగా ఉంచాలని జగన్ భావించారు. లోకల్ గా వస్తున్న ఫండింగ్ రానివ్వకుండా చేయాలన్నదే అసలు ఎత్తుగడ. ఇందుకోసం ప్రత్యర్థులను ప్రజల్లో పలుచన చేస్తే సరిపోతుంది. ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టకుండా చేసేందుకు చేయాల్సిన పనులన్నీ చేశారు.
రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఐడీ కేసులు నమోదయ్యాయి. జేసీ బ్రదర్స్ వంటి వారి వ్యాపారాలపై ఐటీ దాడులు జరిగాయి. సంగం డెయిరీలో సోదాలు నిర్వహించారు. టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్ను అందిస్తున్న ప్రతి ఒక్క వ్యాపార సంస్థపై ఈ తరహా దాడులు చేయించారు. విమర్శిస్తున్న వారి నోటిని కట్టేయడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. అయితే, ఇవే టీడీపీ ప్లస్ గా మారిపోయాయి. మళ్లీ వైసీపీ అధికారంలో వస్తే తమ వ్యాపారాలు ఇక సాగవన్న భయాందోళనకర వాతావరణం తీసుకువచ్చింది అధికార పార్టీ నాయకులే.

టీడీపీని బతికించుకుందామన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల్లో ఎక్కవైపోయింది. లోకల్ ఫండింగ్ అయితే కట్టడి చేయగలిగారుగాని, విదేశీ ఫండింగ్ పై ప్రభావం చూపలేకపోయారు. టీడీపీకి స్వతహాగా ఎన్నారై ఫండింగ్ ఎక్కువ. ప్రస్తుతం వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తుండటంతో, చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచేందుకు కొత్త రక్తం కూడా సిద్ధంగా ఉంటుంది. రాబోవు ఎన్నికల్లో ఖర్చు కూడా కాస్త ఎక్కవగానే ఉంటుంది. ఒక్కో ఎమ్మెల్యే దాదాపు 100 కోట్ల పైమాటే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన వేల కోట్లు అవసరమవుతాయి. పార్టీ ఫండింగ్ లేనిదే అది సాధ్యం కాకపోవచ్చు. వైసీపీ నేతలు సృష్టించిన భయకంపిత వాతావరణం ఆ పార్టీ కంటే ప్రతిపక్షాలు ఏకమవడానికి కారణమైందనడంతో సందే్హం లేదు.