Mahabubabad: మా తల్లే.. నీది ఎంత గొప్ప మనసు.. ఇలా కూడా భర్తకు పెళ్లి చేస్తారా?

పెళ్ళి.. ఈ రెండు అక్షరాల పదానికి మనదేశంలో చాలా విలువ ఉంటుంది.. పెళ్లి చేసుకోవడం ద్వారా ఓ యువతి, యువకుడు వైవాహిక బంధం లోకి ప్రవేశిస్తారు. వారిద్దరూ పిల్లల్ని కనడం ద్వారా కుటుంబాన్ని నిర్మించుకుంటారు. అలాంటి కుటుంబాలు కలిస్తే సమాజం ఏర్పడుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 28, 2024 9:09 pm

Mahabubabad

Follow us on

Mahabubabad: మనదేశంలో పెళ్లి ద్వారా ఏకమయ్యే యువతీ యువకులు ఆ బంధానికి చాలా విలువ ఇస్తారు. పాశ్చాత్య సంస్కృతి చొచ్చుకు వస్తున్న నేటి కాలంలోనూ పెళ్లి అనేది దృఢంగానే ఉంది. దాని ద్వారా ఏర్పడే బంధం కూడా బలంగానే ఉంది. అందువల్లే కుటుంబాలు ఇంకా విచ్చిన్నం కాలేదు. సరే కొన్ని కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మెజారిటీ ప్రాంతాలలో ఇప్పటికీ పెళ్లంటే గౌరవం ఉంది. దాని ద్వారా ఏర్పడే వైవాహిక బంధానికి ఒక విలువ ఉంది. ఇలా ఏర్పడే బంధంలో భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ప్రేమ, హక్కులు, అజమాయిషీ వంటివి ఉంటాయి. అటు భార్య పక్క చూపులు చూస్తే భర్త, ఇటు భర్త కృష్ణ లీలలు ప్రదర్శిస్తే భార్య ఊరుకోరు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఆ సమయంలో గొడవలు కూడా చోటుచేసుకుంటాయి. అయితే ఈ పరంపరలో భార్య కాస్త ఎక్కువ పెత్తనం భర్త మీద చెలాయిస్తూ ఉంటుంది. పొరపాటున భర్త ఏదైనా తప్పు పని చేస్తే.. తనని కాదని ఇంకో ఆడదాని దగ్గరికి వెళితే పాత సినిమాల్లో సూర్యకాంతం లాగా రచ్చ రచ్చ చేస్తుంది.

అయితే ఈ స్టోరీలో భార్య పూర్తి విభిన్నం. తను ఉండగానే తన భర్తకు మరో యువతితో ఆమె పెళ్లి చేసింది. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన సరితకు భర్త సురేష్ ఉన్నాడు. వీరిద్దరికీ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి పిల్లలు ఉన్నారు. అయితే మానసిక దివ్యాంగురాలైన సంధ్య అనే మహిళ సురేష్ ను ఇష్టపడింది. సురేష్ కు సంధ్య మేనమామ కూతురు. ఆమె పుట్టగానే సురేష్ కు ఇచ్చి పెళ్లి చేస్తామని పెద్దలు భావించారు. కానీ ఆమె మానసిక వికలాంగురాలు కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే చిన్నప్పటినుంచి సురేష్ పై సంధ్య విపరీతమైన ప్రేమ పెంచుకుంది. కానీ ఆ విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే సురేష్ సరితను వివాహం చేసుకున్నాడు. ఎలాగూ పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో సంధ్య అలాగే ఉంటున్నది. ఇటీవల సంధ్య సురేష్ ను ఇష్టపడుతున్న విషయాన్ని సరితకు చెప్పడంతో.. ఒక మహిళగా ఆమె బాధను అర్థం చేసుకుంది. తన భర్తకు సంధ్య విషయాన్ని చెప్పి ఒప్పించింది. బుధవారం మహబూబాబాద్ లోని ఓ గుడిలో పెళ్లి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తున్నాయి. కాగా, తను ఉండగానే మరో మహిళతో భర్తకు పెళ్లి చేయడం పట్ల నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.