
Rajasthan Woman Fight Crocodile: భర్త కోసం యముడితోనే పోరాడింది సావిత్రి. చివరకు విజయం సాధించి భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది పురాణం.. అయితే అది జరిగిందని ఎవరికీ తెలియదు… ఎవరూ చూడలేదు. కానీ కలియుగంలో ఓ వీరనారి తన భర్త కోసం యముడి లాంటి మొసలితో పోరాడింది. చివరకు భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటన చంబల్ నది తీరాన జరిదింది.
మొసలికి చిక్కిన భర్త..
రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలీ జిల్లా మండరాయల్ సబ్ డివిజన్‌లో మేకలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బనీసింగ్ మీనా(23). మంగళవారం వాటికి నీళ్లు తాగించేందుకు చంబల్ నది వద్దకు వెళ్లాడు. తనకూ దాహంగా ఉండటంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగబోయాడు. అంతే.. నీటి మాటు నుంచి ఒక్క ఉదుటున లేచి బనీసింగ్‌పై దాడి చేసిన మొసలి. అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది.
వీరోచిత పోరాటం..
అనూహ్యమైన ఘటనతో బిత్తరపోయిన బనీసింగ్ గట్టిగా కేకలు వేశాడు. కాస్త దూరంలో ఉన్న ఆయన భార్య విమలాబాయి భర్త కేకలు విని పరుగున వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసి వెంటనే తేరుకొన్న ఆమె.. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పదే పదే బాదింది. కాసేపటికి బనీసింగ్ కాలు వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. ఇంతలో చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకొన్నారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ‘కళ్ల ముందు మృత్యువు కనిపించింది. నా భార్య తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది’ అని బనీసింగ్ తెలిపాడు. మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుసని, ఆ క్షణంలో తన భర్తను కాపాడుకోవడం ఒక్కటే లక్ష్యం కావడంతో భయం వేయలేదని విమల తెలిపింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమల సాహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కలియుగ సావిత్రి అంటూ అభివర్ణిస్తున్నారు నెటిజన్లు.