
BRS: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ అశాంతికి ప్లాన్ చేస్తోందా.. అరాచకాలకు తెర తీస్తోందా.. రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలిటికల్ సర్కిల్స్ నుంచి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏ రాష్ట్రం కూడా అధికార పార్టీ వ్యవహరించని విధంగా వ్యవహరించడమే ఇందుకు కారణంగా చూపుతున్నారు. అయితే విపక్షాలను ఇరికించే ప్రయత్నంలో కేసీఆరే ఇరుక్కుపోతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
నోటీసులు.. తప్పుడు కేసులు..
తెలంగాణలో అధికారం కేవలం నలుగురి చేతుల్లో ఉందన్న మాట ఎవరు అవునన్నా కాదన్న వాస్తవం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కేంద్రంగానే అధికారం సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా.. ఈ నలుగురు చెప్పిందే వాళ్లకు వేదం. అయితే తొమ్మిదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత పెరిగింది. కుటుంబ కేంద్రంగా సాగిస్తున్న పాలన, ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు, క్షేత్రస్థాయి లీడర్ల అరాచకాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచాయి. పథకాలు పేరుతో డబ్బులు ఇస్తున్నాం.. తమ ఓటుబ్యాంకు చెక్కు చెదరదన్న ధీమాలో ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇటీవలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది.
వ్యతిరేకతపై ఇంటలిజెన్స్ రిపోర్టు..
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు రిపోర్టు ఇస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్థల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయిస్తున్నారు. అయితే అన్ని రిపోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తున్నాయి. దీంతో అసహనానికి గురవుతోంది కల్వకుంట్ల ఫ్యామిలీ. కేసీఆర్‌తోపాటు సౌమ్యుడిగా, తెలివైన వ్యక్తిగా, విషయ పరిజ్ఞానం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న కేటీఆర్‌లో సైతం కొన్ని రోజులుగా అసహనం పెరుగుతోంది. మాట జారుగున్నారు. ఇక కవితలో అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచే అసహనం నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ దందాలో ఆమె పేరు బయటకు రావడంతో చిక్కుల్లో పడ్డారు. మరోవైపు స్వయంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి స్వయంగా ఇరుక్కుపోయారు. ఇక టీఎస్‌పీఎస్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కూరుకుపోయారు. దీంతో విపక్షాలు కల్వకుంట్ల ఫ్యామిలీని బ్రోకర్, లీకర్, లిక్కర్ అంటూ ప్రచారం చేస్తోంది. కవిత ౖజñ లుకు వెళ్లడం ఖాయమని ప్రకటిస్తూ, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
విపక్షాలపై విరుచుకు పడుతున్నారు..
వరుస సంక్షోభాలు, మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల్లో పాలకులపై పెరుగుతున్న వ్యతిరేకతతో ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కాబట్టి వీలైనన్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనను టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడని విపక్షాలు ఆరోపించడంపై కేటీఆర్ అసహనానికి లోనయ్యారు. రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసులు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించారు. అయితే ఈ నోటీసులకు వారు భయపడలేదు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇరికించారు. రెండు గంటల తర్వాత సంజయ్ వాట్సాప్‌కు ప్రశ్నపత్రం వచ్చిందని, ఆయననే ఈ లీకేజీకి బాధ్యుడని ఏ1గా కేసు పెట్టించి జైలుకు పంపారు.
న్యాయమూర్తులే ఆశ్చర్యపోయేలా..
ఇక కేసీఆర్ సర్కార్ పెడుతున్న కేసులు చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో సంజయ్ 317 జీవోకు వ్యతిరేకంగా దీక్ష తలపెట్టగా ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారు. తాజాగా ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇరికించారు. దీంతో హనుమకొండ కోర్టు జడ్జీనే ఈ కేసు చూసి ఇలాంటి కేసు తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

అల్లర్లు జరగాలనేనా..
విపక్షాలపై తప్పుడు కేసులు, దాడులు చూస్తుంటే తెలంగాణలో అల్లర్లు జరగాలనే బీజేపీ కోరుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ తరహాలో తెలంగాణలో దాడులు, అల్లర్లు సృష్టించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం పోలీసులతో విపక్షాలను అణచివేయాలని, తపుపడు కేసులు పెట్టించాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ ఎన్నికల స్ట్రాటజిస్టు సూచన మేరకే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.