
BRS: అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలని, అవసరం లేకపోయినా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అయితే ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న ఈ ఎమ్మెల్యేలే ఇప్పుడు ఆ పార్టీకి భారంగా మారారు. కేసీఆర్‌కు తలనొప్పి తెస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటే మొత్తానికే మోసం వస్తుందని కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు అన్నీ ఉప్పు – నిప్పులా న్నాయి. బీఆర్‌ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం సంచలనం అయింది. వీరిద్దరి సమస్య ఫిరాయింపుల ద్వారా బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారి కారణంగా వీరికి టిక్కెట్లు దక్కలేదు. దక్కే చాన్స్ కూడా లేకుండా పోయింది. అందుకే వీరు బీఆర్‌ఎస్ తమను సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నారు.
ఇంకా అనేక మంది..
అయితే వీరిద్దరే జూపల్లి, పొంగులేటితోనే సమస్య సమసిపోలేదు. ఇంకా చాలా మంది ఉన్నారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్‌ఎస్ తరఫున పని చేసిన నేతలు పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరాటం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఓడిపోయిన ప్రతీచోటా బలమైన అభ్యర్థులు ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

బీఆర్‌ఎస్ కాకపోతే.. బీజేపీ, కాంగ్రెస్..
ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో పార్టీ టికెట్‌పై గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు అధిష్టానంపై ఓత్తిడి తెస్తున్నారు. కన్షర్మేషన్ కోసం పట్టుపడుతున్నారు. సిట్టింగులకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ కాకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇద్దర్ని సస్పెండ్ చేసినా వారు పార్టీకి వ్యతిరేకంగా మారింది.. తమను కాదని ఫిరాయింపు దార్లను ప్రోత్సహించినప్పుడే. ఇతర చోట్లా కూడా ఉన్న ఈ అసంతృప్తి బయటపడితే ప్రమాదమని.. హైకమాండ్ వెంటనే ఇలాంటి అసంతృప్తుల్ని సర్దుబాటు చేయకపోతే అంటుకుంటుందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి గులాబీ బాస్ ఈ అసంతృప్త జ్వాలలను ఎలా చల్లారుస్తారో చూడాలి. చల్లార్చకుంటే మాత్రం వారి ప్రభావం కూడా బీఆర్‌ఎస్ ఓటమికి ఒక కారణం అవుతుంది.