
Minister Audimulapu Suresh: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలను అడ్డుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తన్నట్లు తెలుస్తోంది. ఆయన వెళ్లిన ప్రతీచోట జననీరాజనాలు అందుతుండటంతో ఖంగుతింటున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బల నిరూపణకు దిగుతున్నారు. ఇటీవల గుడివాడలో చంద్రబాబును అక్కడి వైసీపీ నేతలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాజాగా ఇటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలోనూ జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మంత్రి అని కూడా మర్చిపోయి చొక్కా విప్పి మరీ సవాళ్లు చేయడంపై విమర్శలు ఎక్కువయ్యాయి.
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన అనంతరం ప్రకాశం జిల్లాలో మూడు నాలుగు రోజులు పర్యటిస్తున్నారు. యర్రగొండపాలెం, గిద్దలూరులో రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం పూనుకుంది. అయితే, యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటామని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆయన కార్యాలయం వద్దకు చంద్రబాబు కాన్వాయ్ రాగానే వైసీపీ కార్యర్తలు రాళ్లు రువ్వారు. చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఒకరికి తలకు గాయాలయ్యాయి.
చంద్రబాబు రోడ్డు షోలను అప్రదిష్ట పాల్జేయడానికి వైసీపీ నేతలు ఈ పనిచేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ కుట్రలో భాగంగానే వైసీపీ శ్రేణులు దాడి చేయగా, తిరిగి టీడీపీ శ్రేణులు తిరిగి ఎదురు దాడికి దిగితే చంద్రబాబు సభను అడ్డుకొని లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించవచ్చనే పన్నాగం వేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ను సంతృప్తి పరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రాబోవు ఎన్నికల్లో ఆయనకు సీటు లభించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన విధేయతను చాటుకుంటుకునేందుకు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేయించినట్లు టీడీపీ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుభూతితో గెలవచ్చని జగన్ వేసిన ప్లాన్ ను ఆ పార్టీ నేతలు తూచా తప్పకుండా పాటించి చూపుతున్నారు. ఆ మేరకు మంత్రి సురేష్ దళితులపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వాదనను వినిపించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో అడ్డుకునే ప్రయత్నం చేసి, ఆ వర్గాల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేసినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. అనంతరం చంద్రబాబు సభలో వైసీపీ ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు.