Homeట్రెండింగ్ న్యూస్Air India Urination Incident: మనోళ్లు విమానాల్లో ఇంత గలీజుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?

Air India Urination Incident: మనోళ్లు విమానాల్లో ఇంత గలీజుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?

Air India Urination Incident: రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ప్రవర్తించాలి. ఇందులో కాస్త అటూ ఇటూ అయితే పరువు పోవడం ఖాయం.. ఇక విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు హుందాగా వ్యవహరించాలి. తోటి ప్రయాణికుల పట్ల సఖ్యతగా మసులుకోవాలి.. కానీ ఇవేవీ తెలియని కొందరు మూర్ఖశిఖామణుల విచక్షణ కోల్పోయిన ప్రవర్తన వల్ల నగబాటు పాలవుతున్నారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి కావడంతో భారత్ పరువు పోతోంది.

Air India Urination Incident
Air India Urination Incident

-కొంచెం కూడా ఇంగితం లేదా?

సాధారణంగా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అది గత దశాబ్ద కాలం నుంచి మరింత ఎక్కువైంది.. మరోవైపు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోవడంతో విమానయాన సంస్థలు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇవే ప్రయాణికులను విచక్షణ కోల్పోయేలా చేస్తున్నాయి.. మొన్న బ్యాంకాక్ నుంచి ఇండియాకు వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు.. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. మాటల యుద్ధంతో మొదలై చివరకు అది ముష్టి ఘాతాలకు దారి తీసింది.. శాంతంగా మాట్లాడు అని ఒక వ్యక్తి అంటే… చేతులు కిందికి దించు ముందు అంటూ మరో వ్యక్తి అనడం వీడియోలో కనిపించింది.. అంతేకాదు వారిద్దరిని శాంతింపచేసేందుకు విమాన సిబ్బందితోపాటు వారి మిత్రులు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు.. ఇక ఓ వ్యక్తి సహనం కోల్పోయి మరో వ్యక్తిని చెంప దెబ్బ కొట్టగా… ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు అలా చూస్తుండిపోయారు.. తర్వాత తేరుకుని ఎవరి స్థానాల్లో వారిని కూర్చోబెట్టారు.

-ప్రయాణికురాలి పై మూత్రం పోశాడు

ఇక బ్యాంకాక్ ఘటన మరవకముందే… న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులకు, డీజీసీఏ అధికారులకు ఎయిర్ ఇండియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. సదరు వ్యక్తిపై సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విమానం ల్యాండ్ అయ్యాక అతడు దర్జాగా వెళ్ళిపోయాడు. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాసులో 70 ఏళ్లు పైబడిన వృద్ధురాలు ప్రయాణిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె సీటు దగ్గరికి వచ్చి మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకపోవడంతో మరో ప్రయాణికుడు వచ్చి బలవంతంగా పంపించాడు.. భోజనం అనంతరం విమానంలో లైట్లు ఆర్పిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో ఆ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుడి వల్ల దుస్తులు, బ్యాగు తడిచిపోయాయని వాపోయారు. దీంతో సిబ్బంది ఆమెకు మరో జత దుస్తులు, స్లిప్పర్స్ ఇచ్చారు.. అంతేకానీ ఆ ప్రయాణికుడి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ ఘటన జరిగిన మరుసటి రోజు ఎయిర్ ఇండియా సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ కు లేఖ రాశారు.” తడిచిపోయిన సీట్లు నేను కూర్చోలేనని చెప్పాను.. దీంతో సిబ్బంది వారు కూర్చున్న సీటు కేటాయించారు.. గంట తర్వాత తిరిగి నన్ను నా సీట్లోకి వెళ్లిపొమ్మన్నారు.. షీట్లతో కవర్ చేసి,డిస్ ఇన్ ఫెక్టెంట్ తో స్ప్రే చేసినా అక్కడ వాసన పోలేదు.. నేను కూర్చోలేనని చెప్పడంతో తిరిగి సిబ్బంది కూర్చునే సీట్లోకే పంపించారు. బిజినెస్ క్లాస్ లో సీట్లు ఖాళీగా ఉన్నా నాకు కేటాయించలేదు.” అని ఆమె పేర్కొన్నారు.

-ప్రయాణికుడి పై నిషేధం

ఆమె లేఖ తర్వాత ఎయిర్ ఇండియా ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.. సదరు ప్రయాణికుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అంతకంటే ముందే అతడు విమానాల్లో ప్రయాణించకుండా 30 రోజులపాటు నిషేధం విధించింది. అతడిని నో ఫ్లై జాబితాలో చేర్చాలని డీజీసీఏ కు సిఫారసు చేసింది.. ప్రస్తుతం డీజీసీఏ కమిటీ దర్యాప్తు చేస్తున్నది.

Air India Urination Incident
Air India Urination Incident

నిన్న పారిస్-ఢిల్లీ విమానంలోనూ అదే జరిగింది..

న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో నవంబర్ 26న జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగిన పది రోజుల తర్వాత నిన్న పారిస్-ఢిల్లీ విమానంలోనే అదే రిపీట్ అయ్యింది. ఫుల్లుగా తాగిన మగ ప్రయాణీకుడు ఒక మహిళా ప్రయాణీకురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్ ఈ విషయాన్ని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి నివేదించాడు. విమానం ఉదయం 9:40 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది. మగ ప్రయాణీకుడు మద్యం మత్తులో ఉన్నాడని.. అతను క్యాబిన్ సిబ్బంది సూచనలను పాటించడం లేదని విమానాశ్రయ భద్రతకు సమాచారం అందించారు. మగ ప్రయాణికుడిని విమానం దిగిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పట్టుకుంది. అయితే ఇద్దరు ప్రయాణికులు “పరస్పర రాజీ” కుదుర్చుకున్న తర్వాత.. నిందితుడు రాతపూర్వక క్షమాపణ తెలపడంతో అతన్ని విడిచిపెట్టడానికి అనుమతించారని వారు తెలిపారు. తొలుత లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన మహిళ ప్రయాణీకురాలు పోలీసు కేసు నమోదు చేయడానికి నిరాకరించిందని, అందువల్ల ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఫార్మాలిటీలను క్లియర్ చేసిన తర్వాత విమానాశ్రయ భద్రత ద్వారా ప్రయాణికుడిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇలా విమానాల్లో మనోళ్ల గలీజు పనులు ప్రపంచవ్యాప్తంగా మన పరువు తీస్తున్నాయి. విమానాల్లో మద్యం తాగడం అనే అలవాటును మానిపిస్తేనే ఈ తంతుకు తెరపడే అవకాశం ఉంది. లేదంటే ఫుల్లుగా తాగి ఇలా ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తూ మన పరువు తీస్తున్నారు మందుబాబులు. వీరికి కఠిన నిబంధనలు పొందుపరిస్తే తప్ప ఇలాంటివి రిపీట్ కావు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version