YCP Rally Against G.O No1: ‘మనం చేస్తే సంసారం.. ప్రతిపక్షాలు చేస్తే వ్యభిచారం’ అన్నట్టుంది ఏపీలోని అధికార వైసీపీ తీరు. విపక్షాలను కట్టడి చేసేందుకు ఎప్పుడో బ్రిటీష్ పాలకులు తెచ్చిన పోలీస్ జీవోను తెచ్చారు. రహదారులపై సభలు, సమావేశాలు, రోడ్ షోలను నిషేధించారు. అయితే అది విపక్షాల కోసమే అన్నట్టుంది ఏపీలో పరిస్థితి. ఆ జీవోను అపహాస్యం చేస్తూ వైసీపీ శ్రేణులే రాష్ట్రంలో వీరంగం సృష్టిస్తున్నాయి. వందలాది మందితో నాయకులు బలప్రదర్శనకు దిగుతున్నారు. డీజే సౌండ్స్ తో రోత పుట్టిస్తున్నారు. బాణసంచాతో మోత మోగిస్తున్నారు. వందలాది వాహనాలతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. అయినా అక్కడే ఉండే పోలీసులకు జీవో 1 గుర్తుకు రాలేదు. దాని గురించి మరిచిపోయి అధికార పార్టీకి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల అంతగా చెలరేగిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనను జీవో సాకు చూపి అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డు తగులుతున్న వైనాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు.

రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం జీవో 1 తెచ్చామని చెబుతున్న వైసీపీ పాలకులు తమకు ఆ జీవో అతీతమని భావిస్తున్నారు. నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారాన్ని అట్టహాసంగా చేసి చూపించారు. దానిని ఒక రిహార్సల్స్ గా చూపించి మున్ముందు ఆజీవోను అడ్డంపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేయబోయే ‘అధికారిక’ కార్యక్రమాలకు సంకేతాలిచ్చారు. విపక్షాల మెడను వంచి తాము మాత్రం దర్జాగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేసి తీరుతామని హెచ్చరికలు పంపారు. ఇటీవల నందిగామ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వేడుకగా.. జీవోకు విరుద్ధంగా జరిపించి తమకు అడ్డే లేదని నిరూపించుకున్నారు. అంతకు ముందు పట్టణ, జాతీయ రహదారులపై గంటల తరబడి ర్యాలీలు జరిపించారు. వందలాది మందిని సమీకరించారు. నేతలు ఓపెన్ టాప్ జీపు పై నిల్చొని శ్రేణులకు సూచనలిస్తూ సాగారు. దీనిని పోలీసులు అడ్డుకోలేదు సరికదా… జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులను పిలిపించి మరీ అధికార పార్టీ కార్యక్రమానికి భద్రత కల్పించారు.
అప్పుడెప్పుడో స్వాతంత్రం కోసం పోరాడిన భారతీయులను నియంత్రించేందుకు పెట్టిన బ్రిటీష్ పోలీస్ లా ను ఉపయోగించుకున్నజగన్ సర్కారు తెలివితేటలను అభినందించాల్సిందే. అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ఎదురించిన నేల మనది. గాంధేయవాదంతో బ్రిటీష్ వారిని తరిమికొట్టిన వారసులం మనం. నాటి బ్రిటీష్ చట్టాలపై పోరాడిన మనం.. ఇప్పుడు అవే చట్టాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కూడా పోరాడాల్సిన దుస్థితి దాపురించింది. బ్రిటీష్ రాజ్యాన్ని ఏపీలోనూ పునరావృతం చేశారు అభినవ బ్రిటీష్ కారుడు సీఎం జగన్. సొంత ప్రజలపైనే, నేతలపై బ్రిటీష్ రూల్ ను ప్రయోగించాడు. కానీ తన పార్టీకి, తన పార్టీకి చెందిన నేతలకు, శ్రేణులకు జీవో వర్తించందని నిబంధన విధించారు. కళ్లెదుటే వందలాది మందితో జీవోను తుంగలో తొక్కుతున్న పోలీసులది ప్రేక్షక పాత్ర. పోలీస్ అధికారులది మౌనముద్ర. ఇదేమని గట్టిగా ప్రశ్నిస్తే స్థానికంగా చేసుకున్న చిన్న కార్యక్రమానికి జీవోతో పని ఏమిటి? అన్నట్టు తిరిగి ప్రశ్నిస్తున్నారు.

జీవో 1 అనేది ఈ రాష్ట్ర ప్రజల కోసమే. ఇందులో వైసీపీకి ఎటువంటి మినహాయింపులు ఉండవు. ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వ కట్టప్ప, జగన్ కు కట్టుబానిసైన సలహాదారుడు సజ్జల వారు చెప్పుకొచ్చారు. ఎవరైనా నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇప్పుడు నందిగామాలో వందలాది మందితో జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రదర్శనలు, ర్యాలీలను చూసి సజ్జల వారు ఏం మాట్లాడతారో చూడాలి. వారంతా వైసీపీ వారు కాదని చెప్పుకొస్తారో.. లేకుంటే అది విపక్షాల కుట్రగా అభివర్ణించడానికి వెనుకాడరో చూడాలి. ఒకటి మాత్రం చెప్పగలం. వైసీపీ ఎంత తెగించి వ్యవహరించి వ్యభిచార రాజకీయాలు చేసినా అది లోక కళ్యాణానికే అంటూ చెప్పే తెలివితేటలు వారి సొంతం. అదే విపక్షాల విషయానికి వస్తే ఆ విషయం మరి చెప్పనక్లర్లేదు.