Financial Crisis: ఆర్థిక మాద్యం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో పెరుగుతున్న దవ్యోల్బణం కట్టడికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతోంది. వరుసగా మూడు త్రైమాసికాల్లో వడ్డీరేట్లు పెరిగాయి. దీంతో ఒకప్పుడు 6.5 శాతానికి లభించిన గృహరుణం ఇప్పుడు 9 శాతం పైనే ఉంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల్లో డబ్బులు ఏం చేయాలన్న ఆలోచన మొదలైంది. మిగులు మొత్తాన్ని రుణం తీర్చేందుకు వాడాలా? అధిక రాబడి కోసం పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగించాలా? అన్న సందేహం వస్తోంది.
రిజర్వు బ్యాంకు ‘వడ్డి’ంపుతో..
ద్రవోల్బణం కట్టడికి రిజర్వు బ్యాంకు మూడు పర్యాయాలు రెపోరేటు పెంచింది. దీంతో బ్యాంకులు రుణాల వడ్డీరేట్లు పెంచాయి. ఈ నేపథ్యంలో మన దగ్గరున్న మిగులు మొత్తాన్ని ఏంచేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. వ్యక్తిగత పరిస్థితులను బట్టి, ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సిన అంశమిది. దీనికోసం కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకుంటే సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అప్పు తీర్చేందుకు మీ దగ్గరున్న అవకాశాలేమిటి? దీన్ని మీ ఆర్థిక స్థిరత్వం (సాల్వెన్సీ)గా చెప్పొచ్చు. మీ ఆస్తులు, మీ రుణ బాధ్యతలకంటే ఎక్కువగా ఉంటే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లే. ఉదాహరణకు మీకు రూ.30 లక్షల గృహరుణం ఉంది. కానీ, మీ పొదుపు, పెట్టుబడులు రూ.50 లక్షలు. ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో మీ రుణాన్ని ఒకే చెల్లింపుతో ముగించే సామర్థ్యం మీకు ఉంది. ఆర్థికంగా మీకున్న ఈ బలం రుణాన్ని ముందుగా చెల్లించాల్సిన అవసరానికంటే.. పెట్టుబడులపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మరో అంశమూ పరిశీలించాలి. మీ రుణాలు మీ ఆస్తులను మించినప్పటికీ.. ప్రతి నెలా మీ ఆదాయంతో ఆ రుణ వాయిదాలను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చెల్లిస్తున్నారనుకోండి. అప్పుడూ పెట్టుబడులనే ఎంచుకోవచ్చు.
ఆదాయానికి మించి అప్పులు ఉంటే..
ఆదాయం, ఆస్తులకు మించి అప్పులు ఉన్నప్పుడు.. సాధ్యమైనంత తొందరగా రుణాలను తీర్చేందుకు ప్రయత్నించాలి. అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు రుణం, భారీగా ఉండే గృహ రుణాలను చెల్లించేందుకు కేటాయింపులు పెంచాలి. చాలామంది తమ గృహరుణ వ్యవధి పూర్తి కాలం ముగియకముందే రుణాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుల భారం తొందరగా వదిలించుకునే ప్రయత్నంలో భాగమే ఇది. కానీ, ఇందులో కొన్ని లాభనష్టాలను లెక్కలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు 20 ఏళ్ల వ్యవధికి 7 శాతం వడ్డీతో రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నారనుకుందాం. మీరు రుణం ప్రారంభంలోనే ఒక ఈఎంఐ రూ.38,765ని అదనంగా చెల్లిస్తే.. మీ రుణ కాల పరిమితి మూడు నెలలు తగ్గుతుంది. దాదాపు రూ.1.15 లక్షల వడ్డీ మిగులుతుంది. కానీ, ఇదే మొత్తాన్ని 12 శాతం రాబడి అంచనాతో ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేస్తే 20 ఏళ్లలో రూ.3.73 లక్షలు అయ్యే అవకాశముంది.
ఏది మంచిది..
– ముందస్తు చెల్లింపా? పెట్టుబడా? ఈ రెండింటిలో ఏది మంచిది అనేది మీరు సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాల ఆధారంగా నిర్ణయించాల్సి వస్తుంది. రుణ చెల్లింపులు, పెట్టుబడులు ఈ రెండింటి మధ్యా సమతౌల్యం సాధించాలి. గృహరుణాన్ని తొందరగా తీర్చేయాలంటే.. ఏడాదికోసారి అసలులో 5 శాతం చెల్లించడం మంచిది. ఇక్కడ మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. తొందరగా రుణం నుంచి విముక్తి పొందాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ, భవిష్యత్ లక్ష్యాలను పణంగా పెట్టకూడదు.
– మీ ఆర్థిక అవసరాలనూ అర్థం చేసుకోవాలి. అత్యవసర నిధి, ఆరోగ్య, జీవిత బీమా, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా అవసరమైనంత మొత్తం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రాథమిక అవసరాలు తీరకుండా రుణాన్ని తొందరగా తీర్చాలనే ఆలోచన సరికాదు.
– గృహరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2 లక్షల వరకూ, అసలుకు సెక్ష¯Œ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వడ్డీ రేటు అధికంగా ఉంటే, మీ దగ్గర వీలైనంత మొత్తాన్ని గృహరుణానికి జమ చేయండి. పన్ను మినహాయింపు గురించి ఇక్కడ ఆలోచించకూడదు. ముఖ్యంగా రుణం ప్రారంభ రోజుల్లో అధికంగా చెల్లించడం వల్ల భారం తగ్గుతుంది.
పరిమిత ఆదాయం ఉంటే..
మీకు పరిమిత ఆదాయ వనరులు ఉన్నాయనుకుందాం. అయినప్పటికీ రుణాన్ని తొందరగా తీర్చాలనుకుంటే.. ఈఎంఐని మీకు ఇబ్బంది లేనంత మేరకు పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే సమయంలో మీ పెట్టుబడుల విషయంలో రాజీ పడకూడదు. ఇలా చేయడం వల్ల ముందస్తు చెల్లింపు, పెట్టుబడులు రెండింటిపైనా దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
రిటైర్మెంట్‌కు దగ్గర ఉంటే..
– ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న వారు మరో ఆలోచన లేకుండా సాధ్యమైనంత తొందరగా రుణాన్ని ముగించే ప్రయత్నం చేయడమే మంచిది. ఒకేసారి మొత్తం రుణాన్ని తీర్చేసినా ఇబ్బందేమీ లేదు. పదవీ విరమణ తర్వాతా రుణాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉండకుండా చూసుకోవాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: The financial crisis is having a severe impact on the poor and middle class people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com