
BJP Vs Congress: దేశంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. దేశాన్ని సుమారు 60 ఏళ్లు పాలించింది. కానీ ఈ పార్టీ నేడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 9 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలోని రెండు రాష్ట్రాల్లో మూత్రమే పూర్తి మెజారిటీలో అధికారంలో ఉంది. ఇదే సమయంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ ఈ ఏడాది జరిగే 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం సొంత పార్టీ నేతల్లోనే లేదు. శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న పార్టీ ఈ పరిస్థితికి కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది.
ఎందుకీ గడ్డు పరిస్థితి..
కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొవడానికి అనేక కారణాలు చూపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వాజ్‌పేయి ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకూ కాంగ్రెస్ తమకు ఎదురు లేదన్న భానలో ఉంది. తాము చేస్తేనే అభివృద్ధి అన్న భావనను ప్రజల్లో కల్పించింది. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించింది. కానీ వాజ్‌పేయి ప్రధాని అయ్యాక ఈ పరిస్థితి మారింది. అప్పటి వరకు నత్తనడకన సాగుతున్న అభివృద్ధిని వాజ్‌పేయి పరుగులు పెట్టించారు. ఆర్థిక సంస్థరణలతో మధ్య తరగతితోపాటు, ఉద్యోగుల ఆదాయం పెంచారు. పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారు.
మార్పు మొదలైందిలా..
కాంగ్రెస్ సుదీర్ఘ పాలన, బీజేపీ ఐదేళ్ల పాలన మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకున్న ప్రజలు మార్పు మంచికే అన్న అభిప్రాయానికి వచ్చారు. కానీ, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. అయినా యూపీఏ సర్కార్ 2004, 2009లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి పాలనతో పోలిస్తే పదేళ్లలో యూపీఏ పాలనలో మళ్లీ అభివృద్ధి మందగించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మోదీ మానియా మొదలైంది. అదును చూసి దేశ ప్రజలు కాంగ్రెస్‌ను 2014 ఎన్నికల్లో దెబ్బకొట్టారు. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ పాలన తీరే ఆ పార్టీ ఓటమికి కారణం..
కాంగ్రెస్ పాలన తీరే ఆ పార్టీ ఓటమికి కారణంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ నేతలు ప్రజలు ఎప్పుడూ తమ చుట్టూ తిరగాలని భావిస్తారు. తమ పని కోసం నాలుగైదుసార్లు తిరిగిన తర్వాత పనిచేసి తామే చేయించామన్న భావన తీసుకొచ్చారు. కానీ బీజేపీ పాలనలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు పెద్దపెద్ద ఉద్యోగులకే అందిన లక్ష రూపాయల వేతనం బీజేపీలో మధ్య తరగతికి అందింది. టాలెంట్ ఉన్నవారు భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందే పరిస్థితి వచ్చింది. మరోవైపు పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్నట్లు నేతల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. ఇలాంటి పాలనను దేశంలోని మెజారిటీ ప్రజలు మెచ్చారు. ఫలితంగా ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆసక్తి చూపడం లేదు.
మొత్తంగా కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనతో పోలిస్తే.. 15 ఏళ్ల బీజేపీ పాలన మెరుగ్గా ఉండడం, ఆదాయం పెరగడం, పథకాలు నేరుగా ప్రజలకు అందుతుండడంతో ప్రజలు మార్పునే కోరుకుంటున్నారు. అందుకే బీజేపీకే అన్ని ఎన్నికల్లోనూ పట్టం కడుతున్నారు.