
AP Politics: అధికారం కొన్ని కులాల చేతుల్లోనే ఉండిపోయింది. వారి మధ్యే అటూ.. ఇటూ అధికార మార్పిడి జరిగింది. మిగిలిన సమూహం పల్లకీ మోసే బోయిలుగా మిగిలిపోయింది. వారికి జేజేలు పలికి.. జెండాలు మోసే సేవకుల్లా నిలిచిపోయింది. మేమింత.. మాకింత అని గొంతు పెగలక మిన్నుకుండిపోయింది. కాలక్రమేణా రాజకీయ చైతన్యం రగిలింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ నినదిస్తోంది. గర్జించేందుకు అదును కోసం వేచిచూస్తోంది. ఇన్నాళ్లు పల్లకీ మోసింది చాలు.. ఇక నుంచి అధికార పీఠమే లక్ష్యం అంటోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కమ్మ, రెడ్డి కులాల మధ్య ఉండిపోయింది. స్వాతంత్ర్యానంతరం నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ.. ఇలా అన్ని పార్టీలు కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నాయకత్వంలోనే నడిచాయి. ఇప్పటికీ అదే ట్రెండు నడుస్తోంది. అత్యధికంగా రెడ్డి సామాజికవర్గం చెందిన వారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ మొదటి నుంచి రెడ్లకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే రాజశేఖర్ రెడ్డి కుటుంబం బలపడటానికి కారణమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చరిష్మాను మించిన సొంత చరిష్మా సంపాదించారు. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు జగన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
టీడీపీ తెరపైకి రావడంతో రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యానికి కొంత అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్మ సామాజికవర్గం అన్ని రంగాల్లో విశేషంగా అభివృద్ధిపథంలోకి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్న చాలా మంది కమ్మసామాజికవర్గ కార్యకర్తలు.. టీడీపీ వెంట నడిచారు. దీంతో కమ్యూనిస్టుల ప్రభ కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఏపీ రాజకీయ చరిత్ర మొత్తం కమ్మ, రెడ్డి కులాల మధ్య రాజకీయ పోరాటంగానే కనిపిస్తుంది. పార్టీలు ఏవైనా.. ఏదో ఒక కులానికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చరిత్రలో కనిపిస్తాయి.

ఏపీ జనాభాలో కమ్మ, రెడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాజకీయ, సినిమా, వ్యాపార రంగాల్లో గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఏపీలో కమ్మ, రెడ్ల కంటే అధికంగా కాపు సామాజికవర్గం ఉంటుంది. దశాబ్ధాలుగా ఏదో పార్టీకి కాపు సామాజికవర్గం అండగా నిలుస్తూ వచ్చింది. కానీ రాజకీయా పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. రాజకీయంగా రెడ్లకు, కమ్మలకు దొరికిన ప్రాధాన్యత కాపులకు దొరకలేదని చెప్పవచ్చు. అవసరమైనపుడు రెడ్లు, కమ్మలు.. కాపుల్ని వాడుకుని అధికారంలోకి వచ్చారు. మొదటిసారిగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపుల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ప్రజారాజ్యం కోసం కాపులు అహరహం శ్రమించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ నడుమ ప్రజారాజ్యం పట్టు సాధించలేకపోయింది. ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయింది.
ప్రజారాజ్యం తర్వాత పవన్ కళ్యాణ్ రెండో ప్రయత్నం చేశారు. జనసేనను స్థాపించారు. జనసేనతో కాపుల్లో మళ్లీ రాజకీయ కాంక్ష రగిలింది. కాపు సామాజికవర్గానికి ఒక్కసారైనా అధికార పీఠం దక్కాలనే పట్టుదల పెరిగింది. డబ్బు ఉన్నా లేకున్నా… సొంత డబ్బుతో జనసేన కోసం కాపులు కష్టపడుతున్నారని చెప్పవచ్చు. వారిలోని రాజకీయ కాంక్షకు నిదర్శనంగా చెప్పవచ్చు. కాపులు పవన్ కళ్యాణ్ ని తమ నాయకుడిగా డిసైడ్ అయిపోయారు. ఎలాగైనా పవన్ కల్యాణ్ ను సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే జనసేనకు అండగా నిలిచారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జనసేన వెంట నడుస్తున్నారు.
ఏపీలో ఒకరకమైన నాయకత్వ అనిశ్చితి నెలకొన్నదని చెప్పవచ్చు. దీనికి కారణం చంద్రబాబు వయసు మీరిపోవడమే. రాజకీయ ఉద్ధండుడైన చంద్రబాబు వయసు మీద పడటంతో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దగ్గరపడింది. ఆయన కొడుకు లోకేష్ లో అంతటి సామర్థ్యాన్ని టీడీపీ నేతలే గుర్తించడంలేదు. దీంతో టీడీపీలో ఒక నాయకత్వ అనిశ్చితి ఏర్పడింది. అదే సమయంలో ఏపీలో నాయకత్వ శూన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ కు సరైన సమయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ కే ఉందని చెబుతున్నారు.
టీడీపీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేయగలిగితే గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాపులు భావిస్తున్నారు. అందుకే టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నా వెంట నడుస్తామని ప్రకటించారు. . ప్రజారాజ్యం అనుభవాలతో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఇదొక మంచి అవకాశంగా కాపులు భావిస్తున్నారు. చంద్రబాబు స్థానాన్ని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో భర్తీ చేయగలిగితే ఎన్నో ఏళ్ల కాపుల కళ సాకారమవుతుంది. ఇన్నాళ్లూ పల్లకీ మోసిన చేతులే అధికారాన్ని చేపడతాయి.