CM KCR: కేంద్రంపై తొడగొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆయనకు తెలియకుండానే సమస్యల వలయంలో కూరుకుపోతున్నారు. ఒకదానివెంటక ఒకటి ఆయనను చుట్టుముడుతున్నాయి. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

నేతలపై కేసులు..
కేంద్రాన్ని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి జాతీయ నేతగా ఎదగాలనుకున్నారు కేసీఆర్.. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్ తెరపైకి తెచ్చారు. ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడిచేస్తోందని ఆరోపించారు. ఈ కేసు విచారణకు హడావుడిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. అయితే ఆ కేసే ఆయనకు తిప్పలు తెస్తోంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకున్న కేసీఆర్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తనను టచ్ చేస్తే ఊరుకుంటానా అన్నట్లు కేంద్రం తన పరిధిలోని దర్యాప్తు సంస్థలతో దాడులు షురూ చేసింది. మొదటిది పార్టీనేతలపై కేసులు.. రెండోది సీబీఐ తన దాకా వచ్చే పరిస్థితి.. మూడోది బీఆర్‌ఎస్, నాలుగోది తెలంగాణ ఆర్థిక సవాళ్లు. వీటిపై కేసీఆర్ దృష్టి పెట్టలేపోతున్నారు. దీంతో అనుకున్న పనులన్నీ వాయిదా పడుతున్నాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసు సీబీఐ చేతికి వెళ్లడం కేసీఆర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కోర్టు తీర్పుతో రాష్ట్రపతి పర్యటన నుంచి అర్ధంతరంగా నిష్క్రమించడమే ఇందుకు నిదర్శనం.
బయటపడేందుకు వ్యూహాలు..
బీఆర్‌ఎస్ పార్టీ నేతలను వరుసగా కేసులు వల్ల వారికి న్యాయ సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేుకుంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అంశాన్ని టేకప్ చేశారు. దాదాపుగా ప్రతీ రోజూ రోహిత్‌రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కేసు పూర్తిగా సీబీఐకి చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాల్సి ఉంది. లేకపోతే.. ఈ కేసు అనేక మలుపులు తిరిగి రాజకీయంగా కేసీఆర్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కేసీఆర్ తన సమయాన్ని వెచ్చించక తప్పదని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ విస్తరణ వాయిదా..
జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్ పార్టీ విస్తరణపై మొన్నటి వరకు దృష్టిపెట్టారు. క్రిస్మస్ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. కానీ కేసులు, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మీదపడుతుండడంతో వెళ్లలేకపోయారు. ఆరు రాష్ట్రాలకు కిసాన్ సెల్ కమిటీలను ప్రకటించాలనుకున్నారు. అదీ వాయిదా పడింది. బీఆర్‌ఎస్ తరపున అన్ని రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించాలని అనుకుంటున్నారు. బీఆర్‌ఎస్ భావజాలాన్ని మరింతగా తీసుకెళ్లడానికి సాహితీ వేత్తలతోనే సంప్రదింపులు జరపాలనుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్లకుపైగా ఆదాయ నష్టం జరిగిందని.. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించి ప్రజల ముందు ఉంచారని కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదేశించారు. అయితే ఈ నెల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేకపోయారు.

రణమా.. శరణమా!
కేంద్రంలో గిచ్చి కయ్యం పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యలు ఇంతటితో ఆగాయా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. కేసీఆర్ వేసే ప్రతీ అడుగుకు ప్రతి అడుగు వేయాలని చూస్తోంది బీజేపీ. దీంతో ఇప్పుడు కేసీఆర్ ముందు రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి కేంద్రాన్నన శరణు కోరడం.. లేదంటే తన వ్యూహాలకు పదునుపెట్టి యుద్ధంచేయడం. కోర్టుల్లోనూ ఎదురుదెబ్బలు తలుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ యుద్ధం చేస్తే మొదటికే మోసం తప్పదన్న అభిప్రాయం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.