Chiranjeevi- Pawan Kalyan: రాజకీయాలను ప్రేమించిన వారే చివరి వరకూ నిలబడగలరు. అనుకున్నది సాధించగలరు. రాజకీయ ఉన్నతి సాధించగలరు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ జరుగుతున్నదదే. రాత్రికి రాత్రే నాయకులు అయిపోవడం చాలా అరుదు. అది ఎక్కడో నూటికి నాటికి ఒక చోట మాత్రమే కనిపిస్తుంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్ననేతలంతా కష్టాలు అధిగమించి ఆ స్థానానికి వచ్చినవారే. అందుకే రాజకీయాలపై ప్రేమ, వ్యామోహం ఉంటేనే అది సాధ్యం. రాజకీయ నాయకుడికి ఓపిక, సహనం చాలా అవసరం. ఓటమి ఎదురైందని దిగులుపడిపోవడం, జనాలు తిరస్కరించారని అస్త్ర సన్యాసం చేయడం వంటివి నాయకుడికి ప్రతికూలాంశాలు. ఇలా రాజకీయాలు నడిపిన చాలా మంది నాయకులు తృటిలో ఉన్నత స్థానాలు అధిరోహించే చాన్స్ కోల్పోతుంటారు. ఇటువంటి జాబితాలో చేరిపోయారు మెగాస్టార్ చిరంజీవి. 2009లో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ 2014 వరకూ కొనసాగి ఉంటే.. జనాలు పీఆర్పీని ఆదరించి ఉండేవారని.. చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఉమ్మడి ఏపీలో గణనీయమైన ఓట్లు సాధించింది. దాదాపు 60 లక్షలకుపైగా ఓట్లు సాధించింది. అయితే అది టీడీపీ ఓటమికి కారణమైందన్న విశ్లేషణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 18 మంది ఎమ్మెల్యేలతో ప్రజారాజ్యం ఐదేళ్ల పాటు కొనసాగి ఉంటే 2014లో జనామోదం పొంది ఉండేదని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి. అయితే చిరంజీవి రాజకీయాలను ప్రేమించలేకపోయారు కనుక సక్సెస్ కాలేదని చెబుతుంటారు. సినిమారంగాన్ని ప్రేమించారు కనుక.. ఆ రంగంలో మెగాస్టార్ గా ఎదిగారని ఉదహరిస్తుంటారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి కేవలం సీఎం పదవి దక్కలేదన్న మనస్తాపంతో ఉన్నపలంగా పొలిటికల్ కెరీర్ ను విడిచిపెట్టేశారన్న అపవాదు చిరంజీవిపై ఉంది.

అయితే ఈ విశ్లేషణల నడుమ పవన్ కళ్యాణ్ కు మంచి మార్కులే పడుతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యానికి గణనీయమైన ఓట్లు.. గౌరవప్రదమైన సీట్లు లభించాయి. కానీ పవన్ మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. అటు పార్టీ ఓటమితో పాటు తాను రెండుచోట్లా ఓడిపోయారు. చిరంజీవి ఎపిసోడ్ ను ఉదాహరణగా తీసుకుంటే పవన్ అస్త్రసన్యాసం చేయలేదు. ఓటమి నుంచి తేరుకున్నారు. మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారు. ఏపీ రాజకీయ యవనికపై జనసేనను నిలబెట్టారు. పార్టీ గ్రాఫ్ ను పెంచుకున్నారు. ఏపీ కి ప్రత్యామ్నాయ పార్టీగా.. ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగారు. జనసేన లేని ఏపీ రాజకీయం ఊహించలేనంతగా తీర్చిదిద్దారు. పవర్ ఫుల్ లీడర్ గా కూడా తనను తాను మార్చుకున్నారు. సినిమాల కంటే రాజకీయాలనే ప్రేమిస్తున్నారు. ప్రజలు ఆదరించకపోయినా.. అదే ప్రజలను ప్రేమించారు. ప్రజాసేవకే తాను మొగ్గుచూపుతానని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ తరువాత అంత ప్రజాసమ్మోహన శక్తిగా మారారు. అయితే ఇది పవన్ ను అభిమానించే వారు కాదు.. రాజకీయ ఎత్తూ పల్లాలను చవిచూసిన నాయకులు… వాటి పర్యవసానాలను దగ్గర నుంచి చూసిన విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు ఓపిక పడి ఉంటే చిరంజీవికి వచ్చే అరుదైన అవకాశం.. ఇప్పుడు పవన్ కు రావడం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు.