
Drinking Alcohol: తాగుతున్నారు.. తూగుతున్నారు. మత్తు కోసం ఏదైనా చేస్తున్నారు.. ఎంత దాకా అయినా వెళ్తున్నారు. ఇదేదో వయస్సు మళ్ళిన వారు చేస్తున్నది కాదు.. దేశానికి వెన్నెముకయిన యువత పడుతున్న పెడ ధోరణి. కేవలం మద్యం మాత్రమే కాదు.. గంజాయి, నల్ల మందు, హెరాయిన్ వంటి డ్రగ్స్ కూడా వాడుతున్నారు. ఆ మత్తులో రకరకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు కూడా మద్యం షాపులను విరివిగా ఏర్పాటు చేస్తుండడంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు.
అలవాటు పెరుగుతోంది
మద్యం తాగే అలవాటు యువతలో పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 10-17 ఏళ్ల పిల్లల్లో 30 లక్షల మంది మద్యానికి అలవాటు పడినట్లు తాజాగా వెల్లడైంది. దేశంలో వివిధ రకాల మత్తుకు బానిసైన వారి గణాంకాలను రాష్ట్రాల వారీగా కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పిల్లల్లో 1.3 శాతం ఆల్కహాల్ సేవిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 17-75 ఏళ్ల వయసువారిలో 15.1 కోట్ల మంది మద్యం సేవిస్తున్నట్లు తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.19 శాతం మంది మద్యం మత్తుకు అలవాటుపడినట్లు వెల్లడించింది. ఒక్క మద్యమే కాదు గంజాయి, నల్లమందు, కొకైన్, ఇన్‌హ్యాలెంట్స్(పెయింట్స్ థిన్నర్స్, డ్రైక్లీనింగ్ ప్లూయిడ్స్,హెయిర్‌స్ర్పే, డియోడ్రెంట్స్, స్ర్పే పెయింట్స్) వాడకంలో కూడా పిల్లలున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఇన్‌హ్యాలెంట్స్ వాడకంలో పెద్దలకంటే పిల్లలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని పెద్దల్లో 0.58 శాతం, పిల్లల్లో ఏకంగా 1.17 శాతం వాడుతున్నారు.
గంజాయికి బానిసలవుతున్నారు
పిల్లల్లో గంజాయి పీల్చుతున్న వారు 0.9శాతం ఉంటే పెద్దల్లో 3.3శాతం ఉన్నారు. నల్లమందు వినియోగిస్తున్న వారిలో పిల్లలు 1.8శాతం, పెద్దలు 2.1శాతం ఉన్నారు. మత్తుమందుల వినియోగంలో పిల్లలు 0.58 శాతం ఉంటే, పెద్దలు 1.21 శాతం మంది ఉన్నారు. డ్రగ్స్ వాడకంలో దేశంలోనే పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 3.1 కోట్లు ఉంది. నల్లమందును దేశవ్యాప్తంగా 2.3 కోట్ల మంది వినియోగిస్తున్నారు. మత్తుమందును దేశవ్యాప్తంగా 1.30 కోట్ల మంది వినియోగిస్తున్నారు. నాలుగైదు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా గంజాయి, నల్లమందు, మత్తుమందుల వినియోగం చాలా తీవ్రస్థాయిలో ఉన్నట్లు ఆ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జాతీయ సగటు కంటే ఎక్కువే..
గంజాయి వాడకంలో దేశసగటు 5.56 శాతం ఉంది. ఈ విషయంలో 13 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. నల్లమందు విషయంలో జాతీయ సగటు 4.03 శాతం ఉండగా, 20 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువగానే వీటిని వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. మత్తుమందు జాతీయ సగటు వినియోగం 2.10 ఉండగా, ఇందులో 22 రాష్ట్రాల వినియోగం నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగానే ఉంది.

ఆ రెండింటిలో తెలంగాణ ఎక్కువే
ఇక తెలంగాణలో గంజాయి వాడకం 1.25 శాతం, నల్లమందు విషయంలో 4.05 శాతం, మత్తుమందులో 2.38 శాతం, కొకైన్ వినియోగంలో 0.15 శాతం ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా నల్లమందు, మత్తుమందు వాడకంలో తెలంగాణ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నల్లమందు వాడకం 4.46 శాతం ఉండగా, మత్తుమందు వినియోగం 3.30 శాతంగా నమోదైంది. జాతీయ సగటు కంటే కొంచెం ఎక్కువగానే ఏపీలో మత్తువాడకం ఉన్నట్లు తేలింది.