Bandi Sanjay Son: రాజకీయ నేతల పిల్లలు, కుటుంబ సభ్యులపై రాజకీయాలు చేసే సంస్కృతి ఇటీలికాలంలో పెరుగుతోంది. గతంలో మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు శరీరాకృతిపై కొంతమంది కామెంట్స్ చేయడం పెద్ద దుమారమే లేపింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం క్రమంగా రాజకీయరంగు పులుముకుంటోంది. సంజయ్ కుమారుడు భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీకి చెందిన విద్యార్థిపై దాడి చేసినట్లు విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పాత ఘటనపై కొత్తగా ఫిర్యాదు..
మహీంద్రా యూనివర్సిటీలో భగీరథ్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల శ్రీరామ్ అనే విద్యార్థిని దూషించడంతోపాటు దాడి చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలేజీ ప్రాంగణంలోనే ఈ దాడి జరిగినట్లు ఆ వీడియోలో ఉంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దీనివెనుక రాజకీయ ప్రమేయం, అధికార పార్టీ ప్రేరేపితం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత ఘటనపై విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు తాజాగా ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. క్రమశిక్షణా సంఘం ఫిర్యాదు మేరకు ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్‌రావ్ వెల్లడించారు. మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారణ జరుపుతామని తెలిపారు.
సోషల్ మీడియాలో దాడి వీడియో..
యూనివర్సిటీలో జరిగిన దాడి వీడియోను బీఆరెస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్‌చేస్తున్నారు. కావాలనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి భగీరథ్‌ను ఇరికించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ పేర్కొనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భగీరథ్, తాను ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని శ్రీరామ్ చెప్పడం కొసమెరుపు.

స్పందించిన సంజయ్..
భగీరథ్‌పై పోలీసు కేసు నమోదు చేసిన విషయమై బండి సంజయ్ ఢిల్లీలో స్పందించారు. తన కుమారుడు తప్పుచేస్తే ఏ శిక్ష అయినా విధించొచ్చని పేర్కొన్నాడు. రాజకీయం చేస్తే తనతో చేయాలని.. తనతో రాజకీయం చేయలేక తన కొడుకుని కేసులో ఇరికించారన్నారు. గతంలో కేసీఆర్ మనవడిపై వేరేవాళ్లు కామెంట్స్ చేస్తే తాను వ్యతిరేకించిన విషయం గుర్తు చేశారు. కానీ పిల్లలు పిల్లలు కొట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. భగీరథ్ పై క్రిమినల్ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రాజకీయాల కోసం ప్రజ దృష్టి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. రాజకీయం కోసం పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయొద్దని సూచించారు.
మొత్తంగా ఈ వ్యవహారం క్రమంగా రాజకీయ రంగుపులుముకుంది. ఈ కేసు బాధితుడి స్టేట్‌మెంట్‌తో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.