Attari Railway Station: శీర్షిక చూడగానే ఇదేంటి రైల్వే స్టేషన్‌లోకి వెళ్లడానికి వీసా అడగడం ఏంటి.. అదీ మన దేశంలో అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ మీరు చదివింది నిజమే.. వాస్తవానికి విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా ఉండాలి. ఇవి లేకుంటే కొన్ని దేశాల్లోకి ఎంట్రీ ఉండదు. అయితే, సొంత దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది. అదే విధంగా ఏ ప్రదేశానికైనా వెళ్లి రావొచ్చు. స్వేచ్ఛగా జీవించొచ్చు. ఇందులో ఎలాంటి ఆంక్షలు ఉండవు. దేశంలో పర్యటించడానికి ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రాంతానికి మాత్రం సాధారణ ప్రవేశ ఉండదు. అక్కడికి వెళ్లాలంటే కచ్చితంగా ఇండియా పాస్‌పోర్టు, పాకిస్థాన్ వీసా ఉండాల్సిందే. మరి ఆ ప్రదేశం ఎక్కడుంది? ఎందుకు ఈ రూల్స్ అమలు చేస్తున్నారు? తెలుసుకుందాం.
అత్తారి రైల్వే స్టేషన్..
కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు బాగా దిగజారాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది పహారా పెరిగింది. దీంతో రవాణాపై ప్రభావం పడింది. భారత్ నుంచి పాకిస్థాన్ మధ్య నడిచే ఏకైక రైలు సంజౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు కూడా రద్దయ్యాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. సరిగ్గా ఇదే మార్గంలో ఉన్న అత్తారి రైల్వే స్టేషన్‌కు ఎంతో వైవిధ్యత ఉంది. భౌగోళికంగా ఈ స్టేషన్ ఇండియాలోనే ఉంది. అయినా భారతీయులు ఈ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. భారత్, పాకిస్థాన్ బోర్డర్ మధ్యలో ఈ అత్తారి రైల్వే స్టేషన్ ఉంది. దీనిని అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అత్తారి స్టేషన్ ఉంది. వాఘా బోర్డర్(పాకిస్థాన్), అట్టారి(భారత్) ప్రాంతాలను ఈ స్టేషన్ పంచుకుంటోంది.
పాకిస్థాన్‌కు ఎంట్రీ పాయింట్.. భారత్‌కు ఎగ్జిట్ పాయింట్..
ఒక రకంగా చెప్పాలంటే అత్తారి రైల్వే స్టేషన్ భారత్‌కు ఎగ్జిట్ పాయింట్. పాకిస్థాన్‌కు ఎంట్రీ పాయింట్. అందుకే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రెండు, మూడు దశల్లో తనిఖీలు పూర్తి చేశాక ఈ స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు అధికారులు అనుమతిస్తారు. ఈ రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వే పరిధిలో ఉంది. ఈ స్టేషన్ నిర్వహణను ఫిరోజ్‌పూర్ డివిజన్ చూసుకుంటుంది.
వీసా, పాస్‌పోర్టు తప్పనిసరి..
అత్తారి రైల్వే స్టేషన్ గురించి తెలియజేస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాల్లో పోస్టులను చేసింది. అమృత్‌సర్ ట్విటర్ అకౌంట్‌లో ఈ స్టేషన్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ఎంతో వైవిధ్యతను కలిగి ఉందని చెప్పడానికి ఈ స్టేషనే నిదర్శనమంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ అడుగు పెట్టాలంటే కచ్చితంగా వీసా, పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని వెల్లడించింది. అక్రమంగా స్టేషన్‌లోకి ప్రవేశించాలని చూస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపింది. పాస్‌పోర్ట్, వీసా లేని వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.