
YS Family: రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ ఫ్యామిలీ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం వైఎస్ ఫ్యామిలీ అంటే.. ఒకే మాట ఒకే బాట చందంగా పరిస్థితి ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందిన తర్వాత కుటుంబంలో విభేదాలు వచ్చాయి. అన్న వెంట సుదీర్ఘకాలం నడిచిన వివేకానంద రెడ్డి.. ఆ తరువాత కాలంలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ లో ఉండి వదినమ్మపైనే పోటీకి దిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడంతో వైఎస్ ఫ్యామిలీ కేంద్రంగా రాజకీయాలు, ఈ హత్యకు సంబంధించిన పరిణామాలు తిరుగుతుండడం గమనార్హం.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనంతర పరిణామాలతో వైఎస్ కుటుంబ వ్యవహారాలు.. వారి చరిత్ర విస్తృతంగా చర్చల్లోకి వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వివేకానంద రెడ్డి హత్య తరువాత వైఎస్ కుటుంబం పరువును.. వాళ్లే తీసుకుంటూ ఉండడం గమనార్హం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసు విషయంలో మాట్లాడేందుకు.. మీడియా ముందుకు వస్తూ ఇది రాజకీయ వివాదం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఈ కేసు విషయంలో ఎలాగైనా అవినాష్ రెడ్డిని బయటపడేయడానికి కథలు చెబుతున్న వారంతా.. వివేకానంద రెడ్డి దుర్మార్గుడు అనే ముద్ర వేసే ప్రయత్నంలో భాగంగా అనేక అభియోగాలు మోపుతున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ కుటుంబం పరువును రోడ్డును పడేసెలా చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. కుటుంబంలోని ఒకరిని రక్షించుకునే ప్రయత్నంలో.. మొత్తంగా కుటుంబ పరువును బజారున పడేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబ పరమైన విమర్శలతో కోర్టులకు..
వైఎస్ ఫ్యామిలీ అంటే.. పులివెందుల, కడప ప్రాంతంలో మంచి పేరుంది. ఈ కుటుంబ సభ్యులకు ప్రజల్లోనూ గౌరవం ఉంది. అయితే ఆ గౌరవాన్ని ఇప్పుడు అదే కుటుంబ సభ్యులు తీసుకుంటూ ఉండడం గమనార్హం. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి పై ఎవరూ చేయలేనంత హీనమైన ఆరోపణలు చేస్తున్నారు. వివేకా కుమార్తెపై అవినాష్ రెడ్డి దారుణ ఆరోపణలు చేశారు. సునీత తండ్రిని చంపించిందని అవినాష్ రెడ్డి విమర్శించడం గమనార్హం. అదే సమయంలో అవినాష్ రెడ్డి వివేకాను వదల్లేదు.. నిందితుల కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధాలు అంటగట్టేశారు. ఆయన అధికారికంగా ఇవి చెబితే అవినాష్ రెడ్డి గురించి చెప్పుకోలేనని ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి. పరస్పరం అభియోగాలు చేసుకుంటూ కోర్టు మెట్లు ఎక్కారు.
నిందితులు వైఎస్ కుటుంబ సభ్యులే..
వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది ఎవరన్న విషయం ఇప్పటికీ తేలకపోయినప్పటికీ.. మొత్తానికి కుటుంబ సభ్యులే ఆయనను హతమార్చారు అన్నది మాత్రం స్పష్టం. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ముద్దాయిలుగా తేలినా, సునీత ఆమె భర్త ముద్దాయిలుగా తేలినా.. అంతిమంగా వైఎస్ కుటుంబ సభ్యులే వివేకానంద రెడ్డి హత్యకు కారకులు కావడం ఒకింత బాధాకరమైన విషయం అనే చెప్పాలి. వైఎస్ కుటుంబ సభ్యులు తాము బయటపడి ఇతరులని ఇరికించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో.. ఈ కుటుంబ కథలు అంతర్గతంగా ఉన్న అంశాలు బయటికి వస్తున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలతో ప్రజలు ఔరా అనుకునేలా చేస్తున్నారు వైఎస్ కుటుంబ సభ్యులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని అమితంగా ఇష్టపడే ఎంతోమంది అభిమానులు ఇప్పుడు.. ఇదేమి ఖర్మ రా బాబు అంటూ మనోవేదనను అనుభవించాల్సిన పరిస్థితి వివేకానంద రెడ్డి హత్య తరువాత ఏర్పడిన పరిణామాలతో కలిగింది. ఏది ఏమైనా వైఎస్ ఫ్యామిలీ అంటే ప్రజలకు ఉన్న గౌరవం, అభిమానం వివేకానంద రెడ్డి హత్య తరువాత కుటుంబంలో తలెత్తిన పరిణామాలతో పూర్తిగా పోవడం గమనార్హం.