
Telangana Vehicles: ఒకప్పుడు సైకిల్ ఉంటేనే గొప్ప. ఏదైనా పని ఉంటే కాలి నడకనే ఆశ్రయించేవారు. మరి కొంతమంది సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవారు. అప్పట్లో సైకిల్ ఉంటేనే మహా గొప్పగా చూసేవారు. ఇక బైక్ ఉందంటే.. చెప్పాల్సిన అవసరం లేదు. కారు తీసుకొని వస్తే ఆశ్చర్యంగా చూసేవారు. కాలం మారింది. ఆర్థిక అంతరాలు తగ్గిపోయాయి. మనిషి జీవన విధానంలో చాలా సాలభ్యాలు వచ్చాయి. సౌకర్యాలు కూడా చెంతకే వచ్చి చేరాయి. దీంతో ఒకప్పుడు విలాస వస్తువులుగా మారినవి ఇప్పుడు కనీస అవసరాలుగా మారాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వాహనాల గురించి.
తెలంగాణ ఏర్పడక ముందు వాహనాల వినియోగం అంతగా ఉండేది కాదు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణంలో మాత్రమే వాహనాల వినియోగం అధికంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పట్టణాల్లో జనాభా పెరగటం, నగరాలు అంతకంతకు విస్తృతం అవడం, ప్రజల జీవన విధానంలో మార్పు రావడంతో వాహనాల కొనుగోలు అమాంతం పెరిగింది. ఒకప్పుడు ఇంటింటికి సైకిల్ ఎలా అయితే ఉండేదో.. ఇప్పుడు ప్రతి ఇంటికి బైక్ అలా మారింది. స్థూలంగా చెప్పాలంటే బైక్ అనేది కానీ వస్తువుగా స్థిరపడిపోయింది. దీంతోపాటు మధ్యతరగతి వాళ్లు కూడా కార్లను కొనుగోలు చేస్తుండడం మారిన పరిస్థితికి అద్దం పడుతున్నది.
గతంలో బైక్ కొనుగోలు చేయాలంటే డౌన్ పేమెంట్ అధికంగా ఉండేది. బ్యాంకులు కూడా ఇంత సులభంగా రుణాలు ఇచ్చేవి కావు. ఒకవేళ ఇచ్చినా కొర్రీలు పెట్టేవి.. కానీ ఇప్పుడు బ్యాంకులు తమ విధానాలను సరళీకృతం చేశాయి. దీంతో రుణాలు పొందడం సులభం అయిపోయింది. ఫలితంగా మారుమూల గ్రామాల ప్రజలు కూడా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దిగువ మధ్యతరగతి వారు కూడా కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. వాహనాల వినియోగం తెలంగాణలో ప్రస్తుతం తారాస్థాయికి చేరింది.

ఒక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 12 నాటికి 71.52 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ సంఖ్య 1.53 కోట్లకు చేరింది. రాష్ట్రం లో ఉన్న 1.20 కోట్ల కుటుంబాల కంటే వాహనాల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. ఇందులో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. ఇవి 73.7% గా ఉన్నాయి.. ఇక కార్ల వాటా 13 శాతంగా ఉంది. వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ లతో రవాణా శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. గత ఏడాది అన్ని రకాల పన్నులు, యూజర్ చార్జిలతో ఏకంగా 6,055 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.. ఇక హైదరాబాదులో ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత కార్ల షోరూం లు ఉన్నాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.