
Telangana Govt: ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఎత్తుకున్న నినాదమిది. దేశంలో రైతుల ప్రభుత్వం తెస్తామని శపథం కూడా చేశారు గులాబీ బాస్. అంతకుముందు జాతీయస్థాయి రైతు సంఘాల నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపారు. ఇంతరకు బాగానే ఉంది. కానీ, తెలంగాణలో ఇప్పుడు రైతులు అరిగోస పడుతున్నారు. అకాల వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు, మిర్చిరైతులు చిన్న పిల్లల్లా చేలలో రోదిస్తున్నారు. ఆరుగాలం శ్రమ నీటిపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు. పత్తి పంట ధర లేక రైతుల ఇళ్లలోనే ఉంది. అకాల వర్షాలకు పత్తి కూడా తడిసి నల్లబడుతోంది. ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అన్న నాయకులు ఈ పరిస్థితిలో రైతులకు అండగా ఉండాలి. అన్నదాతను ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి. భరోసా కల్పించాలి. కానీ ఇవేమీ చేయడం లేదు. రైతులకు జరిగిన నష్టం కంటే.. రైతులకు భరోసా ఇవ్వడం కంటే.. వారికి తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత భరోసా ఇవ్వడమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి ఈడీ ఆఫీస్ ఎదుట పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. కవిత ఈడీ కార్యాలయంలోకి వెళ్లేప్పుడు, కార్యాలయం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తమ పదవి, హోదా కూడా మర్చిపోయి.. చిన్న పాటి కార్యకర్త కన్నా హీనంగా కవిత కారువెనక పరుగులు పెడుతున్నారు. ఢిల్లీ వీధుల్లో తమకు ఓటువేసి గెలిపించిన ప్రజల పరువు తీస్తున్నారు.
ఎవరికీ పట్టని అన్నదాత..
అకాల వర్షాలతో పంటలు నష్టపోయి పుట్టెడు దుంఖంలో ఉన్న రైతులను అధికార పార్టీకి చెందిన ఎవరూ పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు దెబ్బతిన్న పంటలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అందరూ తమ నాయకురాలు కవితకు ఏమౌతుందో అన్న ఆలోచనలోనే ఉన్నారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత కోసం అంత పరితపిస్తున్న నేతలు దేశానికి అన్నంపెట్టే రైతులను మాత్రం వానకు వదిలేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్నది నానుడి. ఇప్పుడు తెలంగాణలో వేల మంది రైతులు పంటలు నష్టపోయి కన్నీరు పెడుతున్నారు. తమ ఉసురు బీఆర్‌ఎస్ సర్కార్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు తప్పక దగులుతుందని పంట నష్టపోయిన రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.
పంజాబ్ రైతులకు తెలంగాణ సొమ్ము..
కేంద్ర తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. దీనిని తనకు అడ్వాన్‌టేజ్‌గా మార్చుకుందామని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతేడాది రైతు ఉద్యమంలో రైతులు అసువులుబాసారని ఆవేదన చెందారు. ఇది దేశానికి మంచిది కాదని ప్రకటించారు. బాధిత రైతుల కుటుంబానికి తెలంగాణ తరఫున రూ.3 లక్షల పరిహారం ఇస్తానని ప్రకటించారు. చెప్పిట్లే గతేడాది పంజాబ్‌కు వెళ్లి.. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇదంతా తెలంగాణ ప్రజలు, రైతుల సొమ్మే. తెలంగాణ రైతుల కుటుంబాలను, సమస్యలను గాలికి వదిలేసి పంజాబ్ రైతుల కుటుంబాలను ఆదుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ, జాతీయస్థాయిలో తనకు గుర్తింపే ముఖ్యమని విమర్శలను కేసీఆర్ లెక్కచేయలేదు.

మళ్లీ తెలంగాణ రైతు అనాథే..
వారం రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగించాయి. వడగండ్లతో మామిడి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిర్చి పూర్తిగా తడిసిపోయింది. వరిపొలాలు నేలవాలాయి. అయినా రైతుల అనాథలుగానే మిగిలారు. రాష్ట్రంలో ఉన్న పాలకులంతా ఢిల్లీ వీధుల్లో కవిత కారు వెంట పరుగులు పెడుతున్నారు తప్ప రాష్ట్రంలో తమ నియోజకవర్గాల్లో జరిగిన రైతుల గురించి ఆలోచన చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతన్నాయి. కవిత కారు వెంట పరుగెత్తడమేనా అబ్‌కీబార్ కిసాన్ సర్కార్ ఉద్దేశం.. కూతురును కాపాడుకోవడమేనా బంగారు తెలంగాణ. రైతుల బాధలు ఎవరికీ పట్టవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్నదాత ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కూడా లేరు.
అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు వ్యవహరిస్తున్నారు.