Telangana Cabinet Expansion Jeevan Reddy: అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు గెలిచి చూపించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో తనకు ప్రజల సమస్యలపై క్వశ్చన్ చేసే అవకాశం కల్పించాలని ప్రచారం చేసిన ఆయన.. చివరికి విజయం సాధించి కరీంనగర్ గడ్డపైనే గులాబీ పార్టీ పతనానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడైతే జీవన్ రెడ్డి గెలిచారో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆశావహ దృక్పథం పెరిగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఉద్యమాలను మొదలుపెట్టింది. నిరసనలు ప్రారంభించింది. ఆందోళనలను ఉధృతం చేసింది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి గులాబీ పార్టీకి కరీంనగర్ జిల్లా పెట్టని కోట. అలాంటి జిల్లాలో హస్తం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఏడు స్థానాలను సొంతం చేసుకుంది..
Also Read: ప్రభాస్ ని నేను బావ అని పిలుస్తుంటాను..అతను లేకుంటే కన్నప్ప లేదు – మోహన్ బాబు
ఎమ్మెల్యేగా ఓటమిపాలయ్యారు.
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ 2023 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ స్థానంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కమలం పార్టీ నాయకుడు ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మీద గెలిచిన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సంజయ్.. అనతి కాలంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది ఒక రకంగా జీవన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఆయన పార్టీలోకి రావడానికి జీవన్ రెడ్డి సహించలేకపోయారు. దీంతో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ అన్నట్టుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవలి కాలంలో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఒకరు హత్యకు గురయ్యారు. ఆ హత్యకు కారణం సంజయ్ అనుచరులు అని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆ హత్యకు కారణమైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. జీవన్ రెడ్డి ఇక నాటి ఘటన నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలలో అంతగా పాల్గొనడం లేదు.
ఎలా స్పందిస్తారో
ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కలిశారు. జీవన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయగా.. జీవన్ రెడ్డి వారించారు..” మీరు ఏలుతున్నారు కదా.. మధ్యలో మా గురించి ఎందుకు.. మొత్తం రాజ్యం మీదే కదా.. ఏలండి” అంటూ జీవన్ రెడ్డి తన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను బయటపెట్టాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జీవన్ రెడ్డికి ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ.. ఆయనకు నిరాశ ఎదురయింది. ఇక ఈ పరిణామం ఆయన రాజకీయ భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా హస్తం పార్టీలో సీనియర్ నాయకుల పెత్తనం పోయి.. కొత్తగా పార్టీలో చేరిన వారికే అవకాశాలు లభిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఈ పరిణామంపై జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.