Homeట్రెండింగ్ న్యూస్Tech Leader Becomes Taxi Driver : టాప్ టెక్ లీడర్.. ట్యాక్సీ డ్రైవర్ గా.....

Tech Leader Becomes Taxi Driver : టాప్ టెక్ లీడర్.. ట్యాక్సీ డ్రైవర్ గా.. ఇదీ బెంగళూరులో పరిస్థితి!

Tech Leader Becomes Taxi Driver : మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఐటీ ఉద్యోగాలలో కూడా తెలియని కోణాలు ఉంటాయి. విపరీతమైన ఒత్తిడి.. టార్గెట్లు.. వంటివి ఐటీ ఉద్యోగాలలో సర్వసాధారణం. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐటీ ఉద్యోగుల కొలువులకు భద్రత అనేది లేదు. ఉన్నవారి మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. టార్గెట్లు తొందర పూర్తి చేయాలని కంపెనీలు ఆదేశాలు ఇస్తుండడంతో చాలామంది వారాంతాల్లో కూడా పనిచేస్తున్నారు. ఈ సమయంలో కనిపించని ఒత్తిడి వారిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక ఐటి ఉద్యోగుల్లో చాలామంది 30 సంవత్సరాలకు మించిన వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఉద్యోగం రావడం ఒక ఇబ్బంది అయితే.. దానిని కాపాడుకోవడం మరొక ఇబ్బంది. అందువల్లే చాలామంది ఐటీ ఉద్యోగులు వివాహాలు చేసుకునే సమయంలో ఆలస్యం చేస్తుంటారు. అలా పరిణయం చేసుకునే విషయంలో ఆలస్యం చేసిన ఓ ఐటీ ఉద్యోగి.. చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత దేశ సాంకేతిక రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో ప్రఖ్యాత ఐటీ సంస్థలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనదేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు పని చేస్తుంటారు. జీతాలు, భత్యాలు భారీగానే స్వీకరిస్తుంటారు. ఇటీవల ఓ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి తన కార్యాలయానికి వెళ్ళడానికి ఉబర్ కారు బుక్ చేసుకుంది. అయితే ఆ కారు తోలుతున్నది తన టీం లీడర్ అని గుర్తించింది. దీంతో ఒకసారిగా ఆమె ఆశ్చర్యపోయింది. వాస్తవానికి తన టీం లీడర్ కు 5 అంకెలకు మించి జీతం వస్తుంది. బెంగళూరులో ఖరీదైన ప్రాంతంలో అతడు నివసిస్తుంటాడు. పైగా అతడికి ఇతర భత్యాలు కూడా భారీగానే వస్తుంటాయి. అయినప్పటికీ అతడు కారు తోలడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.. అయితే దీనికి సంబంధించి అతడిని ఆమె వివరాలు కోరితే.. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు.. సదరు టీం లీడర్ వయసు 30 సంవత్సరాలు దాటిపోయింది. ఉద్యోగం రావడానికి అతడు తీవ్రంగా కష్టపడ్డాడు. ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి కూడా అతడు అంతే స్థాయిలో ఇబ్బంది పడ్డాడు. అయితే పెళ్లి చేసుకునే సందర్భంలో అతనికి కొన్ని అంచనాలు ఉండడం.. అవి ఉన్న మహిళలు దొరకపోవడంతో వివాహం ఆలస్యమైంది. పైగా అతని తల్లిదండ్రులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దీంతో అతడికి ఒంటరితనం పెరిగిపోయింది. దానిని భరించలేక అతడు ఉబర్ కారు డ్రైవర్ గా మారిపోయాడు. టీం లీడర్ కాబట్టి వారాంతాల్లో అతడు డ్రైవింగ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి కూడా కారు తోలుతూ వెళ్తున్నాడు.

అలా కారు తోలడం వల్ల భిన్నమైన వ్యక్తులు అతడికి పరిచయం అవుతున్నారు. వారితో మాటలు కలిపి తనలో ఉన్న ఒంటరితనాన్ని అతడు దూరం చేసుకున్నాడు. ఒంటరితనం వల్ల విపరీతమైన ఒత్తిడి ఉంటుందని.. దానిని అధిగమించడానికి తాను ఈ పని చేస్తున్నట్టు ఆ టీం లీడర్ చెప్పాడు. గతంలో కూడా బెంగళూరులో మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ఓ ఉద్యోగి.. ఒంటరితనాన్ని భరించలేక.. ఓ కంపెనీలో ఆటో తోలడం మొదలుపెట్టాడు. అప్పట్లో ఆ విషయం సంచలనంగా మారింది. వాస్తవానికి ఐటీ కంపెనీలు తమ ఉత్పత్తులపై.. క్లైంట్లపై భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఉద్యోగులకు రిక్రియేషన్ కల్పించడంలో మాత్రం అంతగా ఆసక్తి చూపించవు. ఉద్యోగుల మీద ఒత్తిడి లేకుండా.. ఒంటరిగా ఉండే ఉద్యోగుల్లో ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version