గురు బ్రహ్మ..
గురు విష్ణు..
గురుదేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:
Teacher’s Day 2025: ఈ శ్లోకం గురువును దేవుడితో పోల్చుతుంది. భారతదేశ చరిత్రలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. భారతంలో పాండవ, కౌరవులకు ద్రోణాచార్యుడు, రామాయణంలో రామ లక్ష్మణులకు వశిష్ఠ మహర్షి గురువు. మహా భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు రథసారథియే కాదు.. అర్జునుడికి గీతోపదేశం చేసిన గురువు కూడా. అలాగే శ్రీకృష్ణదేవరాయలకు మంత్రి తిమ్మరుసు, చంద్రగుప్తా మౌర్యుడికి కౌటిల్యుడు అలెగ్జాండర్‌కు ప్లేటో, ప్లేటోకు రూసో, రూసోకు అరిస్టాటిల్ గురువు. ఇలా చరిత్రలో నిలిచిపోయిన అనేక మంది రాజులు, మహా వీరుల వెనుక గురువుల మార్గదర్శకత్వం ఉంది. గురువులు చూపిన మార్గం, నేర్చుకున్న విద్య వారిని ఉన్నత స్థానంలో నిలిపాయి. వారి విజయాల్లో వెన్నుదన్నుగా నిలిచి వారి కీర్తిని ఖండాంతరాలకు చాటింది.
Also Read: అందర్నీ మేనేజ్ చేసింది.. హోమ్ మినిస్టర్ కుర్చీపై కర్చీఫ్ వేసింది.. కానీ చివరికి..
ఉపాధ్యాయ దినోత్సవం
స్వాతంత్య్ర అనంతరం భారతదేశ మొదటి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అక్టోబర్ 5 తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా యూఎన్‌ఓ (ఐక్యరాజ్య సమితి) ప్రకటించింది.
ఆధునికత వైపు..
విద్య ఆధునికత వైపు పయనించాలి. మూఢ నమ్మకాల నుంచి విజ్ఞానం వైపు తీసుకెళ్లాలి. మారుతున్న కాలానుగుణంగా ఉండాలి. పాత విధానాలకు స్వస్తి పలికి ప్రస్తుత, భవిష్యత్ తరాలకు బాటలు వేయాలి. మనిషిలో నైతిక మార్పు తీసుకురావాలి.
తరగతి గదుల్లో..
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. తరగతి గది దేవాలయంతో సమానం. అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికే స్థలం. మనిషి మనిషిగా, జ్ఞానిగా మారే చోటు.
సృష్టిలో మాట్లాడడం, ఆలోచించడం మనిషికి గొప్ప వరం. ఆ ఆలోచనలను సన్మార్గం, ఉత్తమ విలువలు, నైపుణ్యాన్ని మెరుగు చేసేది గురువే.
విజ్ఞానం-విచక్షణ
విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విచక్షణ ఉండాలి. విచక్షణ లేని విద్య నిష్ప్రయోజనం. ఈమధ్య చదుకు(కొ)న్న కొంత మంది మూర్ఖంగా ప్రవర్తించడానికి కారణం ఇదే. ఆర్ట్స్ నేపథ్యం ఉన్న కోర్సుల్లోనే కాకుండా సాంకేతిక ఉన్నత విద్యలో సైతం నైతిక విలువల అభ్యసన, ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలి. ఉన్నత చదువులు చదివిన కొంత మంది అనైతికంగా ప్రవర్తిస్తున్నారు.
ఋజువర్తన
ఋజువర్తన, సృజనాత్మకత, బోధానాసక్తి లేని వారు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకుండా నిరోధించాలి. వారి వృత్తి, ప్రవృత్తి వేరైతే దాని ప్రభావం విద్యార్థుల మీద ఉంటుంది. విద్యార్థులకు రోల్ మోడల్ తర్వాత గురువే. గురువులకు అపఖ్యాతి తీసుకొచ్చే వికృత మనస్కులకు చెక్ పెట్టాలి. ఉన్నత భావాలు కలిగిన గురువులే విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయగలరు.
పట్టాలు`ఉపాధి
నైపుణ్యాలను పరీక్షించి పట్టాలు ప్రదానం చేయడమే కాదు.. పట్టాదారులకు ఉపాధి కల్పించాలి. భారతదేశంలో బీఈడీ, డీఈడీ, టెట్, నెట్, స్లెట్ పూర్తి చేసిన వారు కోట్లల్లో నిరుద్యోగులకుగా మిగులుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇచ్చే బోటాబోటి జీతం సరిపోక, అది కూడా క్రమంగా ఇవ్వకపోవడంతో వీరు బోధనేతర రంగాలకు మళ్లుతున్నారు. దీంతో వృత్తి విద్యా కోర్సులు చేయని వారు నైపుణ్యం లేని వారు టీచర్ అవతారమెత్తుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే టీచర్లు కచ్చితంగా వృత్తి విద్యా కోర్సులు ఉత్తీర్ణులైనవారిని మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
రేపటి పౌరులు
పునాది గట్టిగా ఉంటేనే భవనం నిలబడుతుంది. అలాగే నేటి బాలలకు సరైన దృక్పథంలో విద్యనందిస్తేనే రేపటి ఉత్తమ పౌరులుగా మారుతారు. నైతిక మానవ వనరులు కలిగిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. విద్యను ప్రభుత్వాలు లాభాపేక్షతో కాకుండా సంక్షేమ కోణంలో చూడాలి. ఐఐఐటీ, ఐఐటీ, నిట్, విశ్వవిద్యాలయాల ఏర్పాటే కాదు గ్రామాల్లో ప్రాథమిక స్థాయిలో అందించే విద్య నాణ్యంగా ఉండాలి. పట్టా ఉండి నైపుణ్యం లేని వారు నిరుద్యోగులుగా మిగలడానికి కారణం ఇదే.
ఉదాసీనత
దక్షిణ కొరియా, జపాన్, ఫిన్‌లాండ్, ఎస్తోనియా, సింగపూర్ తదితర దేశాలు బోధన రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. విద్యారంగంపై ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని వీడాలి. విద్యకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచాలి. రాశి కన్నా వాసి గల ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి. ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నవారికి వృత్యంతర శిక్షణ ఇచ్చి సుశిక్షితులుగా మార్చాలి. ఆకర్షణీయ వేతనం ఇస్తూ యువత దృష్టిని బోధన రంగం వైపు మళ్లించాలి. బతకలేని, బతుకు నేర్చిన పంతుళ్లను కాకుండా బతుకును నేర్పే పంతుళ్లతో సమసమాజం ఏర్పడుతుంది.
సురేష్ కుమార్ బొచ్చు ఎంఏ, బీఈడీ, జర్నలిస్ట్, పరకాల