Nellore Lady Don Aruna: మన వ్యవస్థ చాలా గొప్పది. అందువల్లే ప్రజాస్వామ్యం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ప్రజాస్వామ్యం అనే మాటకే తప్పుడు అర్థం వస్తోంది. కొంతమంది వ్యక్తులు చేసే తప్పుడు పనుల వల్ల మన రాజ్యాంగం నగుబాటుకు గురవుతోంది. ఎంతో గొప్ప లక్ష్యంతో మన వ్యవస్థను పెద్దలు నిర్మించారు. కానీ తప్పుడు వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతోంది. అలాంటిదే ఉదంతం కూడా..
మనదేశంలో అన్ని రంగాలను రాజకీయ శక్తి ప్రభావితం చేస్తుంది. ఎంతటి గొప్ప వ్యవస్థ అయినా సరే రాజకీయ నాయకుల ముందు తలవంచాల్సిందే.. అది ఆమెకు నచ్చింది. పుట్టింది సామాన్య కుటుంబంలో అయినప్పటికీ.. గొప్పగా ఎదగాలని.. పదిమందితో జేజేలు కొట్టించుకోవాలని ఆమెకు ఉండేది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆమె సన్మార్గంలో వెళ్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కష్టపడే ఓపిక ఆమెకు లేదు. దేన్నైనా సులువుగా సాధించాలని కోరికతో ఆమె అడ్డదారులు తొక్కింది. ఫలితంగా ఆమె అసలు రంగు బయటపడి ఇప్పుడు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది.
ఇటీవల కాలంలో నెల్లూరులో అరుణ గురించి విపరీతమైన చర్చ జరిగింది. నేరమయ కార్యకలాపాలతో.. నేరస్తులతో అంటకాగి.. ఆమె ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. బృందాలను నియమించుకొని అడ్డగోలు కార్యకలాపాలకు పాల్పడింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఒక యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకుంది. దానిని తన రాజకీయ జీవితానికి ప్రచారంగా వాడుకుంది. పోలీసులతో సన్నిహిత సంబంధాలను మొదలుపెట్టింది. వారితో రాసలీలలు కొనసాగించింది. వాటిని వివిధ రూపాలలో చిత్రీకరించడం.. వాటి ద్వారా పోలీసు ఉన్నతాధికారులను బెదిరించడం.. తనకు అనుకూలంగా అన్ని పనులు చేసుకోవడం.. ఇలా సాగిపోయింది ఆమె వ్యవహారం. ఏకంగా ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం దాకా ఆమె వెళ్లగలిగింది. వెళ్లడం మాత్రమే కాదు అందరినీ ప్రభావితం చేసింది. ఒకానొక దశలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆమె అనుకుంది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం గనుక మరలా ఏర్పడితే కచ్చితంగా హోం మంత్రి అవుతానని ఆమె చెప్పుకోవడం మొదలుపెట్టింది. చెప్పుకోవడమే కాదు పలు వర్గాల నుంచి డబ్బు కూడా వసూలు చేసింది.
నేరమయ వ్యక్తులు.. చీకటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు.. అసాంఘిక శక్తులు.. వీరంతా కూడా ఆమెకు డబ్బును సర్దుబాటు చేశారు. ఆమె అనుకున్నట్టుగా టికెట్ రాకపోవడంతో కొంత ఇబ్బంది పడినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో మరింత నిరాశలో కూరుకుపోయింది. ఇదే క్రమంలో 6 నెలలపాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పడం మొదలుపెట్టింది. తనకు అలవాటైన వీడియో రికార్డులను అందుకు ఉపయోగించుకుంది. ఆ తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టింది. అయితే ఆమె ఆటకు ఆదిలోనే కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేయడంతో.. జైలుకు వెళ్ళింది. లేకపోతే కథ మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఎక్కడో సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె సన్మార్గంలో పయనించాల్సింది పోయి.. అడ్డదారులు తొక్కింది. చివరికి ఇలా జైలు పాలైంది.