
Kalyani Mulpuri Arrested: ఏపీ పోలీసులు మూడో కన్ను తెరుస్తున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో కాదు. విపక్షాలను అణచివేసేందుకు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపక్షాలను గొంతునొక్కే ప్రయత్నాలు చేసిందన్న విపక్షాల ఆరోపణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న అతి విమర్శలకు దారితీస్తోంది. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల చులకనకు కారణమవుతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ మహిళా నేత విషయంలో వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది. బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ ఆమెను అదుపులోకి తీసుకోవడం మరీ ఎబ్బెట్టుగా ఉంది. నైట్ డ్రెస్ లో ఉన్న ఆమెను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ముప్పేట విమర్శలకు కారణమవుతోంది.
బలవంతంగా అదుపులోకి..
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణిని గన్నవరం పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. హనుమాన్ జంక్షన్ లోని ఆమె నివాసానికి సోమవారం ఉదయం పోలీసులు వెళ్లారు. బెడ్ రూమ్ లో నైట్ డ్రెస్ లో ఉన్న ఆమెను అరెస్ట్ చేశారు. తనకు కొంత సమయం ఇవ్వాలని.. డ్రెస్ చేంజ్ చేసుకుంటానని కోరినా నిరాకరించారు. దీంతో భర్త సురేంద్ర, ఇతర కుటుంబసభ్యులు ప్రతిఘటించేసరికి పోలీసులు వెనక్కి తగ్గారు. డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. అప్పుడు కూడా గది దగ్గరే పోలీసులు వేచి ఉండడంతో మహిళా నేత చాలా ఇబ్బందిపడ్డారు. తరువాత ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. అయితే పోలీసులు అతి చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళ విషయంలో అమానుషంగా వ్యవహరించడాన్ని అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.
గన్నవరం ఘటనకు బాధ్యులు చేస్తూ…
ఫిబ్రవరిలో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొందరు టీడీపీ నేతలపై కూడా వైసీపీ అల్లరిమూకలు దాడిచేశాయి. పోలీసులు మాత్రం టీడీపీ నేతలను బాధ్యులు చేస్తూ కేసులు నమోదుచేశారు. ఆ జాబితాలో కళ్యాణి కూడా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నా ఎస్సీ, ఎస్టీ కేసు కావడంతో మంజూరు కాలేదు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయారు. అయితే హనుమాన్ జంక్షన్ లోని ఆమె నివాసంలో ఉన్నారని సమాచారమందడంతో గన్నవరం పోలీసులు అక్కడకు చేరుకొని గలాటా చేశారు. బలవంతంగా అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. అయినా కళ్యాణిని తొలుత ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. తరువాత కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఈ నెల 24 వరకూ రిమాండ్ విధించారు. అయితే భార్య అరెస్ట్ తీరును ప్రశ్నించిన భర్త సురేంద్రపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నానికి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
అయితే ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు కూడా స్పందించారు. జగన్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. తప్పుడు కేసు పెట్టిందేకాక.. ఓ మహిళ బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. అరెస్ట్ దృశ్యాలను ట్యాగ్ చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వైసీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ్య సమాజంలో మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని.. మూల్యం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ సిద్ధమవుతోంది.