BRS- TDP: 2024లో ప్రతిపక్షాల ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. బీజేపీ, కాంగ్రెసేతరుల్ని కలుపుకుపోతాం. దేశంలో గుణాత్మక మార్పు తెస్తాం. బీజేపీ, కాంగ్రెస్ పాలన ఇంకెన్నాళ్లు ?. ఇవి ఖమ్మం సభలో కేసీఆర్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచారణను కేసీఆర్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. మరి పొరుగున ఉన్న ఏపీలో ఎవరితో కలిసి వెళ్తారు ? ఎలాంటి కార్యాచరణ చేపడతారు ? అన్న చర్చ ఏపీలో మొదలైంది.

ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జనసేన, టీడీపీ పొత్తు అనధికారికంగా ఖాయని చెప్పొచ్చు. బీజేపీ కోసం రెండు పార్టీలు వేచిచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు కేసీఆర్ ఫోకస్ ఏపీ పైన పెరిగింది. జనసేన, టీడీపీ ఓటు బ్యాంకు లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాపు నేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. కాపు ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎంట్రీతో టీడీపీకి కూడ నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ బలైమన పార్టీ. కేసీఆర్ కూడ టీడీపీ నుంచి వెళ్లిన నాయకుడే. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీని గ్రామస్థాయి నుంచి దెబ్బతీస్తూ వచ్చారు. టీడీపీ కీలక నేతల్ని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఫలితంగా తెలంగాణలో టీడీపీ ఉనికికే ప్రమాదం తెచ్చారు.
జగన్, టీడీపీ, జనసేన మధ్య ఏపీలో పోరు నడుస్తోది. కానీ కేసీఆర్ ఎంట్రీతో చతుర్ముఖ పోటీ నెలకొంది. జనసేన, టీడీపీ పొత్తు అధికారిక ప్రకటన వస్తే త్రిముఖ పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ ఖమ్మం సభలో కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. కమ్యూనిస్టులు, ఆప్ నేతలతో పొత్తు దిశగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పొత్తు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏపీలో కూడ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆప్ మద్య పొత్తులు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూటిమిగా ఏర్పడితే.. టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ మధ్య పోరు జరుగుతుంది.

2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. వీరి ప్రయత్నాలకు కేసీఆర్ కూటమి గండికొట్టే ప్రయత్నం జరగవచ్చు. జగన్ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన వైపు వెళ్లకుండా కేసీఆర్ కూటమి వైపు వెళ్తే అది జగన్ కు లాభం అవుతుంది. ఫలితంగా టీడీపీ, జనసేన కూటమికి నష్టం చేకూరుతుంది. హోరాహారిగా పోటీ ఉండే నియోజకవర్గాల్లో కేసీఆర్ కూటమి … జనసేన, టీడీపీని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.