
AP MLC Elections- TDP: తెలుగుదేశం పార్టీ గెలుపు మాట విని చాన్నాళ్లయ్యింది. ఆ పార్టీ శ్రేణులు గెలుపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ రూపంలో వారికి అరుదైన అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పురాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయానికి కూత వేటు దూరంలో ఆ పార్టీ నిలిచింది. గత ఎన్నికల తరువాత రాష్ట్రస్థాయిలో విజయం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొద్ది గంటల్లో తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తూర్పు,పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానాలు వైసీపీ దక్కించుకుంది. రెండుచోట్ల ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ బలపరచిన రామచంద్రారెడ్డి అతి కష్టమ్మీద గట్టెక్కారు. 169 ఓట్లతో విజయం సాధించారు. తూర్పురాయలసీమలో వైసీపీ బలపరచిన చంద్రశేఖర్ రెడ్డి 2 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తూర్పు పట్టభద్రుల స్థానంలో మాత్రం వైసీపీ అభ్యర్థి వెనుక బడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి దాదాపు 9,558 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో మాత్రం వైసీపీ అభ్యర్థి రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు.

మొత్తానికైతే టీడీపీ రెండు పట్టభద్రుల స్థానంలో ఆధిక్యత కనబరుస్తుండడం.. రెండుచోట్ల గెలుపొందే చాన్స్ ఉండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే తాజా ట్రెండ్స్ పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ స్పందించారు. ఏపీలో ట్రెండ్ మారిందన్నారు. మార్పు ప్రారంభమైందన్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఇది కొనసాగుతందన్నారు. టీడీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాయని చెప్పారు. ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలకు వరుసగా హాజరుకానున్నట్టు తెలిపారు. అయితే శాసనమండలిలో టీడీపీకి ప్రాతినిధ్యం తగ్గతున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీ తరుపున ఎలక్ట్ అవుతుండడంతో టీడీపీలో జోష్ నెలకొంది.