Liquor ATM : మందుబాబులకు శుభవార్త. ఇక మద్యం కోసం దుకాణాల వద్ద వెయిట్ చేయవలసిన అవసరం లేదు. విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పనిలేదు. ఏటీఎంలో డబ్బులు తీసుకున్న మాదిరిగా నచ్చిన మద్యంను నిమిషాల వ్యవధిలో పొందవచ్చు. నచ్చిన ధరలో, నచ్చిన బ్రాండ్లు పొందే వెసులబాటును సైతం కల్పించింది తమిళనాడు సర్కారు. వెండింగ్ మిషన్లు ఏర్పాటుచేసింది. క్యూలైన్లతో పనిలేకుండా నేరుగా మద్యంబాబులు మిషన్ల ముందుకెళ్లి మద్యం పొందవచ్చు. చెన్నైలోని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా మిషన్లు ఏర్పాటుచేసింది. సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వమే నడుపుతోంది. అయితే మందుబాబులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా విదేశీ టెక్నాలజీతో మద్యంను మరింత అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. తొలుత మద్యంను లిక్కర్ మాల్స్, షాపింగ్ మాల్స్ లో అందుబాటులో తెచ్చింది. అంతకంటే సులువైన మార్గంలో భాగంగా మిషన్లను ఏర్పాటుచేసింది. కోక్, పెప్సీల సీసాలను ఓ పెద్ద ఫ్రిడ్జ్ నుంచి ఎలా కొనుగోలు చేస్తామో అదే మాదిరిగి నచ్చిన మద్యం బ్రాండ్లను పొందవచ్చు.
అందరికీ అర్ధమయ్యే రీతిలో మిషన్లు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు అక్కడి అధికారులు.వెండింగ్ మిషన్ ముందు నిలుచుకోగానే చిన్నపాటి టీవీ పరిమాణంలో ఉన్న డిస్ప్లేలో అందుబాటులో ఉన్న లిక్కర్ ను చూపిస్తుంది. ఆ లిక్కర్ బొమ్మ క్రిందనే దాని ధర చూపిస్తుంది. మనకు కావాల్సిన సంఖ్యను నమోదు చేస్తే… పేమెంట్ మోడ్ కాష్/యూపీని పేమెంట్ అని అడుగుతుంది. మనకు కావాల్సిన పద్దతిలో నగదు బదిలీ చేసిన అనంతరం ఆ వెండింగ్ మిషన్ నుంచి మనం ఎంపిక చేసుకున్న మద్యం సీసాలు బయటకు పంపుతాయి. అయితే చెన్నైలోని నాలుగు మిషన్ల వద్ద మందుబాబులు భారీగా బారులుదీరుతున్నారు. నచ్చిన మద్యంను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటుచేసేందుకు అధికారులుకసరత్తు చేస్తున్నారు.