నటనకు భాషతో పనిలేదు.. కన్నడ వాసి అయిన రజినీ ఇప్పుడు తమిళుల ఆరాధ్య దేవుడు అయ్యాడు. అలానే తెలుగు వ్యక్తి కాకపోయినా తెలుగులో హీరోగా వెలుగు వెలిగాడు హీరో సుమన్. సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. ఈయన స్వస్థలం తమిళనాడు. తెలుగులో 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఒకనాక దశలో హీరో సుమన్ మెగాస్టార్ చిరంజీవిని సైతం బీట్ చేసి టాలీవుడ్ లో నంబర్ 1 ర్యాంకును పొందాడు. కానీ తర్వాత సుమన్ అథ: పాతాళానికి పడిపోవడానికి కేసులే కారణం.. ఆ జైలు జీవితమే సుమన్ సినిమా జీవితాన్ని కృంగదీసింది.
సుమన్ కు దినకరన్ అనే మంచి స్నేహితుడు ఉండేవాడు. దినకరన్ ఓ పెద్ద వ్యాపారవేత్త కూతురును ప్రేమించాడు. తమిళనాడులో ఆ వ్యాపారి పెద్ద లిక్కర్ కింగ్. అతడి కూతురును దినకరన్ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమ పెళ్లి వెనుకాల హీరో సుమన్ ఉన్నాడని భావించిన లిక్కర్ వ్యాపారి సుమన్ పై కక్ష పెంచుకున్నాడు. అనంతరం సుమన్ ను అడ్డంగా బుక్ చేయించి అమ్మాయిలను లైంగికంగా వేధించాడనే తీవ్రమైన ఆరోపణలతో కేసులు బుక్ చేయించాడు. దాంతో పోలీసులు సుమన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైల్లో ఉన్నప్పుడు సుమన్ ను కలవడానికి అతడి తల్లిని తప్ప ఎవ్వరినీ కలువనిచ్చేవారు కాదట..
ఇక చాలా రోజుల తర్వాత జైల్లో నుంచి వచ్చిన సుమన్ ను మొదట పరామర్శించింది మోహన్ బాబే.. అందుకే ఇప్పటికీ సుమన్ కు మోహన్ బాబు అంటే వల్లమాలిన ప్రేమ. ఇదంతా స్వయంగా సుమనే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అసలు ఈ కేసులో ముగ్గురు అమ్మాయిలు తమను సుమన్ మోసం చేశాడని కేసులు పెట్టారు. ఆ ముగ్గురు వేరు వేరు సమయాల్లో ప్లాన్ ప్రకారం పెట్టారని తర్వాత తేలింది. ముగ్గురితో ఒకసారి సుమన్ అసభ్యంగా ప్రవర్తించినట్టు కేసులు పెట్టారు. అమ్మాయిలు తమ వేధించిన రోజున సుమన్ సినిమా షూటింగ్ లో ఉండడంతో అతడు ఈ కేసుల్లో నిర్ధోషిగా బయటపడ్డాడు. కేసు నిర్ధారణ కావడంతో ఇది తప్పుడు కేసు అని సుమన్ పై కేసులు కొట్టుకుపోయాయి. ఈ కేసుల ప్రభావంతోనే టాలీవుడ్ అగ్రహీరో కావాల్సిన సుమన్.. ఓ స్నేహితుడి కారణంగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే పరిమితమైపోయాడు.