IAS Varunkumar: అతను ఓ సైకిల్ మెకానిక్ కొడుకు అనుకోకుండా అతని తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం కొడుకుపై పడింది. చదువులో మంచి ప్రతిభ కనబర్చే అతడు పదో తరగతి తర్వాత తండ్రి సైకిల్ మెకానిక్ వృత్తిని ఎంచుకున్నాడు. కానీ, అతడిలోని ప్రతిభను గుర్తించిన ఓ వైద్యుడి ప్రోత్సాహంతో ఈ సైకిల్ మెకానిక్.. సివిల్స్ కొట్టాడు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే ఈ ఐఏఎస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రకు చెందిన వరుణ్..
మహారాష్ట్రకు చెందిన వరుణ్‌కుమార్ టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. అప్పటికే చదువులో టాపర్ అయిన వరుణ్ తన కుటుంబానికి అండగా ఉండేందుకు తన తండ్రి సైకిల్ రిపేర్‌ను వృత్తిగా ఎంచుకున్నాడు. రాత్రి, పగలు కష్టపడేవాడు. అయినా తన చదువుకు కావాల్సిన డబ్బులు మాత్రం సంపాదించుకోలేకపోయాడు.
డాక్టర్ సహకారంతో..
వరుణ్ ఇంటి పక్కనే ఉండే ఓ డాక్టర్ అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ప్రతిభ ఉన్న వరుణ్ ఇలా మెకానిక్‌గా మారడాన్ని చూసి చలించాడు. తాను ఇంటర్ ఫీజు కడతానని ముందుకు వచ్చాడు. ఆ డాక్టర్ ఇంటర్ ఫీజు కట్టడంతో వరుణ్ ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత వరుణ్ తల్లి తన కొడుకు పెద్ద చదువులు చదవాలని భావించింది. అందుకోసం తన కొడుకును సమీపంలోని సిటీకి పంపించింది.
ఐటీ కంపనీల్లో ఆఫర్ వచ్చినా..
ఇలా వరుణ్ డిగ్రీ పూర్తిచేశాడు. తర్వాత ఐటీ కంపెనీల్లో ఆఫర్ వచ్చింది. కానీ వరుణ్ లక్ష్యం ఐటీ కాదు. ఇంకా ఏదైనా సాధించాలని యూపీఎస్‌సీకి ప్రపరేషన్ కావాలని నిర్ణయించుకున్నాడు. అయితే పుస్తకాలు కొనేందుకు కూడా అతనివద్ద డబ్బులు లేవు. ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సాయం కోరాడు. ప్రతిభ ఉన్న వరుణ్‌కు సాయం చేయడానికి అందరూ ముందుకు వచ్చారు.
ఒక్కపూట భోజనం చేస్తూ..
వరుణ్ తన లక్ష్యం చేరేందుకు చాలా కష్టపడ్డాడు. తనకు సాయం చేసినవారి మాట నిలబెట్టాలనుకున్నాడు. దీంతో యూసీఎస్‌సీకి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. కేవలం ఒకపూట భోజనం చేస్తూ చదువు తప్ప వేరే వ్యాపకం పెట్టుకోకుండా సన్నద్ధమయ్యాడు. రోజుకు 18 గంటలు చదివేవాడు. దీంతో తొలి ప్రయత్నంలోనే వరుణ్ సివిల్స్‌లో ఆలిండియా 32వ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ అయ్యాడు.
పరిస్థితులకు తలొగ్గకుండా.. తన లక్ష్యం మరువకుండా.. టార్గెట్‌ను చేరుకునేందుకు వరుణ్ చేసిన ప్రయత్నాలు, కష్టపడిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కష్టపడితే ఏ కల అయినా నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఐఏఎస్ వరుణ్‌కుమార్.