Srikakulam YouTube star Appalamma: ఆమె వయస్సు అక్షరాలా ఏడుపదులు. అస్సలు చదువు రాదు. అక్షర జ్ఞానం లేదు. అయితేనే స్టార్ హీరోలను తలదన్నేలా ఫైట్లు చేయగలదు. పేరు మోసిన కథానాయకులు మాదిరిగా అలవోకగా డైలాగులు చెప్పగలదు. సోషల్ మీడియానే షేక్ చేస్తోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బామ్మ. మనవడితో కలిసి రీల్స్ చేస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని చూరగొంది. అప్పుబాలు యూట్యూబ్ ఛానల్ తో అదరగొడుతోంది. నీకెందుకులే అంటూ అవమానాలు ఎదురైనా లెక్కచేయకుండా.. తన వయస్సును గుర్తుచేసుకోకుండా నటిస్తున్న అప్పలమ్మ అనే మత్స్యకార మహిళ స్టోరీ ఇది.
Also Read: 3 BHK ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
* మారుమూల గ్రామంలో
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కర్రివాని పాలెం గ్రామానికి చెందిన మత్స్యకార మహిళ కర్రీ అప్పలమ్మ యూట్యూబ్ ద్వారా విశేష ఆదరణ పొందింది. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫైట్లను అనుసరిస్తుంది. బ్రహ్మానందం, ఇతర కమెడియన్ల మాదిరిగా అలవోకగా డైలాగులు చెబుతూ అదరగొడుతోంది. అచ్చం సినిమాల మాదిరిగా గన్ చేతపట్టి గడగడలాడించేస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాదిరిగా యాక్షన్ హీరోయిన్ గా లేటు వయసులో సైతం లేటెస్ట్ గా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే ఎన్నెన్నో అవమానాలను అధిగమించి.. కులాల కట్టుబాట్లు ఉన్న ప్రాంతంలో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయింది అప్పలమ్మ.
* సాధారణ మత్స్కార మహిళ
అందరి మాదిరిగానే అప్పలమ్మ( aplamma) ఓ సాధారణ మత్స్యకార మహిళ. భర్త తెచ్చి చేపలను గ్రామాల్లో విక్రయించి కుటుంబాన్ని పోషించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు పూర్తయ్యాయి. అప్పలమ్మ సైతం శ్వాస జీవితం అనుభవిస్తుంది. అయితే మూడేళ్ల కిందట మనవడు శివ అప్పలమ్మతో తీసిన చిన్నపాటి వీడియోతో పాటు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. భలేగా ఉంది ఈ బామ్మ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో శివ తన నానమ్మ అప్పలమ్మతో వీడియోలు తీయడం ప్రారంభించాడు. సొంతంగా అప్పుబాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి వీడియోలతో పాటు రీల్స్ను పోస్ట్ చేశాడు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ కు లక్ష వ్యూస్ పెరిగాయి అంటే ఎలా ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
* కట్టుబాట్లు అధికం..
సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో( fisheries villages) కట్టుబాట్లు అధికంగా ఉంటాయి. 70 సంవత్సరాల వయసులో ఇదేం పని అన్నవారు ఉన్నారు. అభ్యంతరాలు చెప్పిన సొంత వారు ఉన్నారు. కానీ తనలో ఉన్న నటన ఆసక్తి, తన మనవడు శివకు మంచి భవిష్యత్తు దొరకాలని అప్పలమ్మ రీల్స్ లో నటిస్తూనే ఉంది. శివ తో పాటు పక్కింటి కుర్రాడు బాలు, గ్రామంలోని పిల్లలు ఎక్కువగా ఈ వీడియోలో నటిస్తుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పలమ్మ ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఏదైనా పనిమీద సమీప పట్టణాలకు వస్తే స్థానికులు ఆమెను ఇట్టే పోల్చుతారు. ఇంతటి వయసులో కూడా ఎనర్జీ గా నటిస్తున్న ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనకంటూ ఒక గుర్తింపు రావడంతో అప్పలమ్మ సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది.



