Somu Veerraju: ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారివి అన్నట్టు పొత్తుల పై కసరత్తు చేస్తున్నాయి. ఒకరు అన్ని ప్రతిపక్ష పార్టీల ఐక్యతను కోరితే.. మరొకరు కొన్ని ప్రతిపక్షాలతోనే కలిసి వెళ్తామని సూచనలిస్తున్నారు. అందరం కలిస్తే ఐక్యంగా వెళ్లొచ్చని ఒకరంటే.. మీరు మాత్రమే కలిసొస్తే కలుపుకుపోతాం అంటూ మరొకరంటున్నారు. ఇంతకీ ఏపీలో పొత్తుల వ్యవహారం తేలుతుందా ? లేదా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి బాంబు పేల్చారు. పొత్తుల పై కన్ప్యూజింగ్ స్టేట్మెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటామని చెప్పారు. అవినీతి, రాజకీయ అధికారం కోసం పోరాడుతున్న పార్టీలకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. 2024లో ఏపీ బీజేపీ జనంతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు. జనసేన కలిసి వస్తే కలిసి పోటీ చేస్తాం అని అన్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతూనే.. కలిసొస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పడం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతూనే.. కలిసొస్తే కలిసి పోటీ చేస్తామనడంలో నిగూఢార్థం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన ప్రతిపక్షాల ఓటు చీలనివ్వకూడదని కంకణం కట్టుకుంది. అందుకోసం టీడీపీ, బీజేపీని కలుపుకుపోవాలని ఆలోచిస్తోంది. ఇదే విషయం పై జనసేనాని పలుమార్లు స్పష్టత ఇచ్చారు. కానీ బీజేపీ టీడీపీతో కలిసి వచ్చేందుకు సిద్ధపడటంలేదు. కేవలం జనసేనతో మాత్రమే పొత్తుకు సిద్ధమని చెబుతోంది. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా అంతిమంగా జగన్ కు లాభం చేకూర్చడం తప్ప మరొకటి కాదని జనసేన నమ్ముతోంది.

బీజేపీ, జనసేనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పవచ్చు. జనసేనది వైసీపీని గద్దెదించాలన్న లక్ష్యమయితే.. బీజేపీది కుటుంబ పార్టీలతో కలిసి వెళ్లకూడదనే అభిప్రాయంగా ఉంది. ఈ రెండు పార్టీల భిన్నమైన దృక్పథాలతో ఏపీలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత సాధ్యం కాదని చెప్పవచ్చు. బీజేపీ మాత్రం ఏపీ పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పదేపదే జనంతో పొత్తు.. కలిసొస్తే జనసేనతో పొత్తు అంటోంది. మరి జనసేన వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడాలి.