Vennela Kishore: ప్రతి జనరేషన్ కి ఓ గొప్ప కమెడియన్ ఉద్బవిస్తారు. బ్రహ్మానందం ఆల్ టైం గ్రేట్. ఆయన హవా నడుస్తున్నప్పటికీ బాబూ మోహన్, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, వేణు మాధవ్ ఒక్కో దశలో టాలీవుడ్ కమెడియన్స్ గా వెలిగిపోయారు. ఈ లిస్ట్ లో చేరిన మరో కమెడియన్ వెన్నెల కిషోర్. టైమింగ్ కామెడీకి వెన్నెల కిషోర్ కేరాఫ్ అడ్రస్. ఫ్రస్ట్రేటెడ్ రోల్స్ కి బ్రాండ్ అంబాసిడర్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే తత్త్వం. నాచురల్ గా ఉండే వెన్నెల కిషోర్ కామెడీ ఆయన్ని స్టార్ చేసింది.

బాల్యం – విద్యాభ్యాసం
వెన్నెల కిషోర్ అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్. 1977 సెప్టెంబర్ 19న తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డిలో పుట్టాడు. హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పైచదువుల కోసం వెన్నెల కిశోర్ అమెరికా వెళ్లారు. ఫెర్రీస్ స్టేట్ యూనివర్సిటీ, మిచిగన్ నందు మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. అనంతరం అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో దర్శకుడు దేవా కట్టా ‘వెన్నెల’ చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. ఆ చిత్ర నేపథ్యం దాదాపు అమెరికాలో నడుస్తుంది. దీంతో వెన్నెల కిషోర్ ని తీసుకోవడం జరిగింది.
సినిమా కెరీర్
వెన్నెల కిషోర్ మొదటి చిత్రం వెన్నెల 2005లో విడుదలైంది. రాజా, పార్వతి మెల్టన్ హీరో హీరోయిన్ గా నటించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వెన్నెల డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ చిత్ర టైటిల్ కిషోర్ ఇంటిపేరుగా మారిపోయింది. వెన్నెల కిషోర్ డిఫరెంట్ కామెడీ స్కిల్స్ తో మేకర్స్ కంట్లో పడ్డాడు. కరెంట్, బిందాస్, ఏమైంది ఈవేళ చిత్రాలతో నిలదొక్కుకున్నాడు. సీమ టపాకాయ్, దూకుడు చిత్రాలతో వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్స్ లిస్ట్ లో చేరారు.
వెన్నెల కిషోర్ ఎదుగుతున్న సమయంలో అప్పటికి ఫార్మ్ లో ఉన్న కమెడియన్స్ ఒక్కొక్కరిగా కన్నుమూశారు. దీంతో వెన్నెల కిషోర్ దర్శక నిర్మాతల బెస్ట్ ఛాయిస్ అయ్యారు. ఆయనకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. 2011 తర్వాత వెన్నెల కిషోర్ కెరీర్ అంచెలంచెలుగా ఎదిగింది. ఏడాదికి 30కి పైగా చిత్రాలు చేసే స్థాయికి వెళ్లారు. హీరో ఎవరైనా కీలకమైన కామెడీ రోల్ అంటే వెన్నెల కిషోర్ చేయాల్సిందే. గత ఏడాది ఆయన 25 సినిమాల వరకు చేశారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశారు.

భోళా శంకర్, భారతీయుడు 2, హను మాన్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. వెన్నెల 1/2, జెఫ్ఫా చిత్రాలకు వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించారు. 45 ఏళ్ల వెన్నెల కిషోర్ ఇంకా వివాహం చేసుకోలేదు. చాలా ప్రాక్టికల్ గా ఉండే వెన్నెల కిషోర్ అందరితో కలివిడిగా ఉంటారు.