Cyber Fraud : లైక్‌ కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకుంది.. సైబర్‌ వలకు చిక్కిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12,95,000 కట్టాలని తేల్చిచెప్పారు. లేనిపక్షంలో కట్టిన డబ్బు తిరిగి రాదని ఖరాకండిగా మోసగాళ్లు చెప్పారు. అప్పటికే రూ.19 లక్షలు చెల్లించి మోసపోవడం, ఇంకా చెల్లించే స్థోమత లేకపోవడంతో నిరాకరించింది. ఆ డబ్బులు వచ్చే అవకాశాలు లేవని, మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది.

Written By: Raj Shekar, Updated On : May 23, 2023 3:03 pm
Follow us on

Cyber Fraud : ఒకడేమో బ్యాంకు అధికారిలా ఫోన్‌ చేసి ఖాతాను అప్‌డేట్‌ చేస్తామని ఓటీపీ చెప్పమంటాడు. ఇంకొకడు ఫేస్‌బుక్‌లో లింక్‌ పంపి.. క్లిక్‌ చేయమని చెప్పి ఉన్న డబ్బును ఊడ్చేస్తాడు.. మరొకడు ఓఎల్‌ఎక్స్‌లో వాహనం అమ్మకానికి పెట్టి రూ.లక్షలు కొల్లగొడతాడు.. ఇలా ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా మోసపోయామన్న ఆవేదనలు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా ‘ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్‌గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు

కొత్త తరహాలో..
 ఈ తరహా కేసులు నగరంలో ఇటీవల కాలంలో నమోదు అవుతున్నాయి. ఈ ప్రకటనలు నిజమే అని నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు మోసగాళ్ల మాయలో చిక్కి విలవిల్లాడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిజమే అని విశ్వసించి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంది. విజయవాడ నగరానికి చెందిన ఓ యువతి టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఫోన్‌ నంబరు అందులో ఉంది. ఆ నంబరుకు ఫోన్ చేయగా.. యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే చాలని, అన్నింటికి లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంతో పాటు ఇది కూడా చేస్తే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని ఆమె ఆశపడింది. అన్నింటికీ అంగీకరించి, తన బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చింది.
 నమ్మించి.. నగదు జమ చేసి..
తర్వాత.. మూడు వీడియోలు లైక్‌ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ అయింది. మరో ఆరు వీడియోలను లైక్‌ చేస్తే.. రూ. 300 ఖాతాలో వేశారు. దీంతో ఆమెకు నమ్మకం కుదిరేలా చేశారు. ప్రీపెయిడ్‌ టాస్కులు చేస్తే ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. పెట్టుబడి అని… దానికి లాభం వస్తుందని చెప్పడంతో ఆమె సరేనన్నారు. అలా తొలుత.. రూ.వెయ్యి చెల్లిస్తే తిరిగి రూ.1,600 ఆమెకు వచ్చాయి. ఇలా ఆమె విడతల వారీగా రూ.19 లక్షలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.
తిరిగి ఇవ్వడానికి.. రూ.12.95 లక్షలు డిమాండ్‌..
లాభం వస్తుందని చూపుతున్నా.. ఆ డబ్బును డ్రా చేసే అవకాశం లేకపోయింది. దీనిపై ఆమె నిలదీయగా.. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12,95,000 కట్టాలని తేల్చిచెప్పారు. లేనిపక్షంలో కట్టిన డబ్బు తిరిగి రాదని ఖరాకండిగా మోసగాళ్లు చెప్పారు. అప్పటికే రూ.19 లక్షలు చెల్లించి మోసపోవడం, ఇంకా చెల్లించే స్థోమత లేకపోవడంతో నిరాకరించింది. ఆ డబ్బులు వచ్చే అవకాశాలు లేవని, మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది.