Rangareddy: సొసైటీలో విలేకరులుగా చలామణి అవుతున్నవారు ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో.. ప్రధాన మీడియా సంస్థల్లో పని చేస్తున్న కంట్రిబ్యూటర్లు(అందరు కాదు) ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో… సొసైటీకి వారు కరోనా వైరస్ లాగా దాపురించారో.. చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ ఘటన. ఒక కుటుంబంలో నలుగురు చనిపోవడానికి అయిదుగురు విలేకరులు, ఓ హోంగార్డు కారణమయ్యారు. వీరంతా కలిసి ఒక కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు. ఈ సంఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరుకు చెందిన నీరటి రవి(40), తన ముగ్గురు కుమారులకు ఈనెల మూడున ఇంట్లో ఉరివేసి చంపాడు. అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం అయిదుగురు విలేకరులు, ఓ హోంగార్డు వేధింపులు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు విలేకరులను అరెస్టు చేశారు. మిగతావారు పరారీ లో ఉన్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. టంగుటూరు గ్రామానికి చెందిన రవి ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసేవాడు. అతడికి గుంటూరుకు చెందిన తిరుపతిరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్ స్కీం లో తిరుపతిరావు ద్వారా రవి చేరాడు. 2000 కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బు మొత్తం ఇస్తారని, ఆ తర్వాత ప్రతి నెల 1000 చొప్పున 6 నెలల వరకు ఇస్తారని తిరుపతిరావు చెప్పడంతో రవి చాలామందిని చేర్పించాడు. అలా సేకరించిన డబ్బును తిరుపతిరావుకు రవి పంపించాడు. తిరుపతిరావు కూడా ప్రతినెల రవికి డబ్బులు పంపితే.. అతడు మిగతా సభ్యులకు చెల్లించేవాడు. ఈ స్కీం ద్వారా రవి బాగానే సంపాదించాడు. కొద్ది నెలల క్రితం అదే గ్రామాల్లోని ఓ రైతు వద్ద ఎకరం భూమి కొనుగోలు చేశాడు. అందులో తన ముగ్గురు పిల్లల పేరు మీద ఎస్ఎంయూ అనే పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నాడు. గత మూడు నెలలుగా తిరుపతిరావు రవికి డబ్బు చెల్లించకపోవడంతో.. ఆ స్కీం లో చేరిన వారంతా రవి పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఈ విషయం బయటకు తెలియడంతో శంకర్పల్లి మండలానికి చెందిన విలేకరులు మంగలి శ్రీనివాస్ (ఏబీఎన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్), కురుమ శ్రీనివాస్ (ఈనాడు), వడ్డే మహేష్ (నమస్తే తెలంగాణ), సనికే ప్రవీణ్ కుమార్ (సాక్షి), సిరిపురం శ్రీనివాసరెడ్డి (వార్త) కలిసి రవిని బెదిరించడం మొదలుపెట్టారు.. ఈ ఉదంతం మొత్తం తమ పత్రికలో, న్యూస్ ఛానల్ లో రాకుండా ఉండాలంటే 20 లక్షలు ఇవ్వాలని బెదిరించారు.
దీంతో గత నెల 19న తన భార్య శ్రీలత పుస్తెలతాడు, నల్లపూసల గొలుసును రవి తాకట్టుపెట్టి 2.5 లక్షలను విలేకరులకు అడ్వాన్స్ గా ఇచ్చాడు.. ఆ స్కీమ్ లో పెట్టుబడిపెట్టిన ఆలూరి రాజు అలియాస్ నాగరాజు (హోంగార్డ్ 4550), అతడి భార్య మనీలా, రామకృష్ణ అనే వ్యక్తులు కూడా రవిని డబ్బుల గురించి ఒత్తిడి తెచ్చారు.. అక్రమంగా డబ్బులు వసూలు చేశావని వేధించారు. ప్రభుత్వ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న అంటూ బెదిరించారు.. దీంతో రవి తన భార్య పేరు మీద రావులపల్లి లో ఉన్న రెండు ప్లాట్లను తాకట్టుపెట్టి తెచ్చిన 18 లక్షలను హోంగార్డు దంపతులతో పాటు రామకృష్ణకు ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న విలేకరులు మిగతా డబ్బుల కోసం రవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.. వారి బాధ తట్టుకోలేక రవి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను కన్నుమూస్తే తన ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటని భావించి.. తన ముగ్గురు కుమారులు సాయికిరణ్, మోహిత్, ఉదయ్ కిరణ్ కు మార్చి మూడున ఉరివేసి చంపేశాడు. అనంతరం అతడు కూడా ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి రేకుల షెడ్డులో ఉరివేసుకొని చనిపోయాడు..
అయితే ఇలా నలుగురు చనిపోవడానికి ప్రధాన కారణం ఈ ఐదుగురు విలేకరులు అని భావించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జిఎస్ఎన్ సంస్థ లావాదేవీలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.. విజయనగరం కేంద్రంగా ఈ సంస్థ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది.
ఈ ఐదుగురు విలేకరులు ఒక వార్త మినహా మిగతా నలుగురు ప్రధాన పత్రికలకు చెందిన వారు కావడంతో.. నమస్తే తెలంగాణ మినహా మిగతా సంస్థలు వార్తను ప్రచురించలేదు. నలుగురు చనిపోతే ఆ యాజమాన్యాలకు వార్త కాకుండా పోయింది. కొంచమైనా ఇంగితం లేకపోతే.. నలుగురు ప్రాణాలను హరించిన వార్తను దాచే ఆ యాజమాన్యాలు ఏం సందేశాలు ఇస్తున్నట్టు? ఉదయం లేస్తే సొసైటీ గురించి, తమకు గిట్టని వారి గురించి పేజీలకు పేజీలు వార్తలు రాసే ఆ పత్రికలు.. తమ సంస్థలో పనిచేసే కంట్రిబ్యూటర్లు నేరాలకు పాల్పడితే మాత్రం రాయకుండా మౌనం పాటించాయి. అప్పట్లో పట్టాభి వార్తకు సంబంధించి డెస్క్ లో పనిచేసిన ఇద్దరు సబ్ ఎడిటర్లు తప్పు చేశారని ఈనాడు ఉద్యోగం నుంచి తొలగించింది. దానిని వార్తగా రాసుకుంది. మరి అలాంటప్పుడు తన సంస్థలో పనిచేసే కంట్రిబ్యూటర్ తప్పు చేస్తే కనీసం వార్తను వార్తలా కూడా రాయలేకపోయింది ఈనాడు. పైగా ఈ పత్రిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. దాని ఓనర్ దమ్మున్న జర్నలిజం అంటూ డప్పాలు కొడుతుంటాడు. క్షేత్రస్థాయిలో కంట్రిబ్యూటర్లు మాత్రం ఇలా జనాన్ని వేధిస్తుంటారు. ఇక సాక్షి.. ఆ పత్రిక కు దిశ, దశ లేకున్నట్టుంది. తన పార్టీని తెలంగాణలో మూసినట్టు.. ఆ పత్రికను కూడా మూస్తే జగన్ కు చాలా బెటర్. ఇక వార్త.. అదొక పేపర్ ఉందని.. ఇవాళ నమస్తే రాస్తేనే తెలిసింది..